High Rise Apartments: ఒకప్పుడు ముంబై లేదా ఢిల్లీ లేదా హైదరాబాద్ లేదా చెన్నై వంటి నగరాలలో మాత్రమే అపార్ట్మెంట్ కల్చర్ కనిపించేది. అది కూడా మోతాదులోనే ఉండేది. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేశంలో టైర్ వన్, టైర్ టు, టైర్ త్రీ సిటీలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అది కూడా నాలుగైదు అంతస్తులు కాదు.. పది, పదిహేను చివరికి 40 అంతస్తుల వరకు కూడా పెరిగిపోయింది.
పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా.. ఫెసిలిటీస్ ను బట్టి ప్లాటు ధరలు నిర్ణయిస్తున్నారు. ఆ మధ్య నోయిడా ప్రాంతంలో ఓ కంపెనీ నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ ధర 217 కోట్లు అని తేలింది. దీనినిబట్టి లగ్జరీకి ఇండియన్స్ ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హైరైజ్ అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఆ గర్భ శ్రీమంతులే. వీరిలో చాలామంది ఫార్మా.. ఐటి.. మ్యానుఫ్యాక్చరింగ్.. పొలిటికల్.. ఇంకా ఇతర రంగాలకు చెందినవారు. వీరి వేతనం కోట్లలో ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
హై రైస్ అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడి ప్రజల మధ్య గొప్ప సంబంధాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి ప్లాట్ లో వారు ఉంటారు. కనీసం ఎదుటివాళ్ళు చనిపోయిన సరే పట్టించుకోరు. ఒకవేళ చనిపోయినప్పటికీ శవాన్ని అపార్ట్మెంట్లోకి తీసుకురావడానికి ఒప్పుకోరు. అయితే ఆస్పత్రి నుంచి స్మశాన వాటికకు వెళ్లాల్సిందే. లేదా సొంత ఊరికి తీసుకెళ్లి ఆఖరి కార్యక్రమాలు జరపాల్సిందే.
హైరైస్ అపార్ట్మెంట్లో ఉండేవారు వస్తారు.. పని ముగించుకొని వెళ్తారు. పక్కన వాటితో కనీసం మాట కూడా మాట్లాడరు. కృత్రిమ మనుషుల మాదిరిగా జీవిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని నోయిడా ప్రాంతంలో ఉంటున్న నమిత శుక్లా అనే మహిళ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. నోయిడా ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద టవర్లను చూపిస్తూ.. ఇవి రెండు పెద్ద ఆకాశ హర్మ్యాలు.. వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. చూడ్డానికి పెద్దగా ఉన్నప్పటికీ.. అందులో ఉండలేము. ఒకవేళ ఉన్నా కూడా ఒంటరి జీవితమే. వచ్చామా.. ఉన్నామా.. బయటికి వెళ్ళామా అన్నట్టుగానే ఉంటుంది పరిస్థితి.. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది పెద్దపెద్ద వాళ్లు క్లబ్బులకు పబ్బులకు వెళ్తుంటారు.. అక్కడ ఒత్తిడి మొత్తం తగ్గించుకొని ఇంటికి వస్తారు. నమిత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.