YS Jagan: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను చేపట్టింది. మెగా డిఎస్పి నిర్వహించి భారీగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసింది.
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని.. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాలలో ఇష్టానుసారంగా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరేపిస్తున్నారు. ప్రభుత్వపరంగా అధికారులు తెర ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. లేని సమస్యలను వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఇటీవల దాదాపు నిర్వహించిన విలేకరుల సమావేశాలలో ప్రధానంగా డీఎస్సీ వ్యవహారాన్ని ప్రస్తావించడం విశేషం.
సాక్షి టీవీలోనే కాకుండా.. ఇటీవల బిగ్ టీవీలో కూడా డీఎస్సీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడిచింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని బిగ్ టీవీ ఏకంగా రోజుల తరబడి వార్తలను ప్రసారం చేసింది. ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాల విషయంలో క్లారిటీ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కోడి గుడ్డు మీద ఈకలు పీకే సామెత తీరుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో డీఎస్సీ నియామకాల ప్రక్రియ మరింత చర్చకు దారితీస్తోంది. మరోవైపు జగన్ కు నారా లోకేష్ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఇంకా మూడు డీఎస్సీలు నిర్వహిస్తామని.. ఎలా అడ్డుకుంటావో నీ ఇష్టం అని జగన్ కు సవాల్ విసిరారు.
డీఎస్సీలో అక్రమాలు జరగకపోయినప్పటికీ.. ఏవో జరిగాయని వైసిపి నానా యాగి చేస్తున్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టిడిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ పై దృష్టి పెట్టాలని చర్చ నడుస్తోంది. నాడు వైసిపి కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని ఏకంగా విజయసాయిరెడ్డి చెప్పిన విషయాన్ని టిడిపి సోషల్ మీడియా వారియర్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ డీఎస్సీకి కౌంటర్ గా కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తవ్వితే గనక అప్పుడు ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారిపోతాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలక విషయాలు ఉన్నాయి. దానితోపాటు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జరిగిన అక్రమాలను బయట పెడితే గనుక అప్పుడు జగన్ మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.