US Foreign Policy Mistakes Middle East Analysis: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. సుమారు 40 రోజులు సాగిన యుద్ధంలో ఇరాన్ ఎక్కడా తలొగ్గలేదు. సుప్రీం లీడర్‌తోపాటు కీలక నేతలు, అధికారులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా ఇరాన్ మాత్రం ప్రతిదాడులతో అమెరికా, ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో అమెరికా డైలమాలో పడింది. ఇప్పుడు శాంతి చర్చల పేరుతో రెండు వారాల సీజ్‌ఫైర్ కుదుర్చుకుంది. ఇక ఈ యుద్ధానికి రష్యా, చైనా వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నాయి. ‘శత్రువు తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడకు‘ అన్న
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ మాటలను పూర్తిగా ఆచరిస్తున్నాయి. ఇరాన్‌కు పరోక్షంగా సాయం చేస్తూనే, పశ్చిమాసియాలో అమెరికా తప్పుల నుంచి భారీ లాభాలు పొందుతున్నాయి.
పశ్చిమాసియాలో తగ్గిన అమెరికా ప్రాబల్యం..
పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని పెంచుకోవడానికి దశాబ్దాలుగా కష్టపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా ప్రభావాన్ని పరిమితం చేసి, 2020 నాటికి చైనాను కూడా నిలువరించింది. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌లతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ ఇటీవల చైనా, రష్యా వ్యూహాత్మక చర్యలతో ఈ ప్రాబల్యం క్షీణించింది. సిరియా అంతర్యుద్ధంలో బషర్ అసద్‌కు మద్దతు ఇచ్చి రష్యా ఇరాన్‌కు దగ్గరైంది. 2023లో సౌదీ అరేబియా–ఇరాన్ మధ్య దౌత్య సయోధ్య కుదిర్చి చైనా తన ప్రభావాన్ని చాటుకుంది. గల్ఫ్ దేశాలు అమెరికాపై విశ్వసనీయత కోల్పోయి, ఆర్థిక సహకారానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి.
మారిన వ్యూహాలు..
ఇరాక్, ఆఫ్గానిస్తాన్ యుద్ధాల్లో అమెరికా వైఫల్యాలు రష్యా, చైనాకు మేలు చేశాయి. అమెరికా ఆస్తులు, వ్యూహాలు మార్చుకుంటున్న సమయంలో ఈ రెండు దేశాలు పశ్చిమాసియాలో ప్రభావాన్ని విస్తరించుకున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి టెహ్రాన్‌పై యుద్ధానికి దిగడం, గ్రీన్‌లాండ్, నాటోపై బెదిరింపులు మిత్రదేశాలతో అమెరికా సంబంధాలను బీటలు వార్చాయి. ఈ విభేదాలను చైనా, రష్యా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.
ఆర్థిక పతనం..
యుద్ధ రంగంలోకి దిగడం అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసింది. పెరిగిన చమురు ధరలు, ఆంక్షల సడలింపులు రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఒత్తిడి ఎదుర్కొన్న మాస్కోకు కాసుల వర్షం కురిసింది. హర్మూజ్ మూసివేత చైనాను దెబ్బతీసినా, దేశీయ చమురు నిల్వలు పెంచుకోవడం, సౌరశక్తి, బ్యాటరీలు, బొగ్గు వనరులను వైవిధ్యపరచడం ద్వారా చైనా ఆర్థికంగా మెరుగైంది.
ట్రంప్ ధోరణి..
చర్చలతో తేల్చుకోకుండా ట్రంప్ యుద్ధానికి కాలుదువ్వడం, మాటలు మార్చడం అమెరికా పరపతిని బలహీనపరిచాయి. ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్నంత కాలం అస్థిర ధోరణి బీజింగ్‌కు ప్రభావం పెంచుకునే అవకాశం ఇచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన 14 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్‌ను ఒప్పించింది చైనాయే. గతంలో ఇరాన్–సౌదీ, రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా చర్చల్లో చైనా కీలక పాత్ర పోషించింది.
ఈ నాలుగు తప్పులు అమెరికాను అగ్రరాజ్య రేసులో బలహీనపరుస్తున్నాయి. చైనా, రష్యా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే, పశ్చిమాసియాలో కొత్త శక్తి సమతుల్యత ఏర్పడుతోంది. ట్రంప్ ధోరణి మారకపోతే, అమెరికా మరింత ఒంటరి అవుతుంది.