Dil Raju Movies : ఆర్ బి చౌదరి అనే ఒక నిర్మాత ఉన్నారా గుర్తుందా. ఇటీవల ఆయన కన్నుమూశారు. ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి అత్యంత విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆయన బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని ఒక నమ్మకం ఉండేది.
ఆర్ బి చౌదరి ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. అదిగో అప్పుడు లభించింది వెంకట రమణారెడ్డి అలియాస్ రాజు రూపంలో. మొదట్లో దిల్ రాజు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని సినిమాలు ఆయనను కాపాడాయి. కానీ కాస్ట్యూమ్ కృష్ణ రూపొందించిన అరుంధతి అనే సినిమాతో ఆయన మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లి పందిరి అనే సినిమా ద్వారా మళ్ళీ దిల్ రాజు నిలబడగలిగారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా ద్వారా వెంకట రమణారెడ్డి కాస్త దిల్ రాజు గా మారిపోయారు.
దిల్.. ఆర్య.. భద్ర.. బొమ్మరిల్లు.. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లాంటి హిట్లను అందిస్తూ తెలుగు చిత్రపశ్రమలో తనకంటూ ఒక బెంచ్ మార్కు సృష్టించుకున్నారు దిల్ రాజు. ఆయన ఒక కథ అనుకుంటే కచ్చితంగా అది హీట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచుకున్నారు.. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సినిమా రంగాన్ని మొత్తం ఆయన శాశించగలిగారు. మీడియం బడ్జెట్ సినిమాలు తీసి భారీగా వసూలు ఎలా సాధించవచ్చో నిరూపించారు.. ఎంతమంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చారు. బొమ్మరిల్లు భాస్కర్.. సుకుమార్.. బోయపాటి శ్రీను.. వేణు శ్రీరామ్.. వంశీ పైడిపల్లి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.
తెలుగు సినిమా రంగాన్ని శాసించగలిగే దిల్ రాజు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు.. మట్టి ముట్టుకుంటే బంగారం అయ్యే ఆయన స్థాయి ఎందుకు దిగజారిపోయింది.. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు ఎదురవుతున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన బలగం.. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇంతవరకు దిల్ రాజు బ్యానర్ కు సాలిడ్ హిట్ లేదు. భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాలు ఎదురు తంతున్నాయి. గేమ్ చేంజర్ ను వందల కోట్లు పెట్టి తీస్తే అంతగా ఆడలేదు. ఒక రకంగా చెప్పాలంటే అత్యంత నిరాశ జనకమైన ఫలితం వచ్చింది. మొదట్లో ఈ సినిమా గురించి హైప్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అది ప్లాప్ అని తేలిపోయింది. ఆ సినిమా ద్వారా ఏ స్థాయిలో నష్టాలు వచ్చాయో ఇటీవల లక్ష్మణ్ అనే నిర్మాత చెప్పిన తర్వాతనే అందరికీ అర్థమైంది. ఇక విజయ్ హీరోగా వచ్చిన వారీసు అలియాస్ వారసుడు గొప్పగా ఆడినట్టు ప్రచారం చేసుకున్నారు గాని.. తమిళంలోని కాస్త ఆ సినిమా ప్రభావం చూపించింది. తెలుగులో అంతంత మాత్రమే..
కథను సరిగా జడ్జ్ చేయడంలో.. జనాలకు ఎక్కుతుందనే బలమైన కాన్సెప్ట్ తో దిల్ రాజు సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. ఉదాహరణకు టాక్సిక్ అనే సినిమాను తీసుకుంటే.. దిల్ రాజుకు బీభత్సమైన నష్టాలను తీసుకొచ్చింది.. వాస్తవానికి ఈ సినిమా విషయంలో రాజు దూకుడుగా వెళ్లారని ఇప్పటికి ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కన్నడ హీరోలకు మన తెలుగులో గొప్పగా చెప్పుకునే మార్కెట్ ఉండదు. కేజిఎఫ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయని.. యష్ నటించిన ప్రతి సినిమా అలా అవ్వాలని లేదు. కానీ ఈ విషయంలో రాజు అంచనా తప్పింది. ఫలితంగా దిల్ రాజు కాస్త ఫ్లాప్ రాజు అయ్యారు..
త్వరలో వచ్చే రామాయణం సినిమా మీద ఆయన వందల కోట్లు పెట్టారు. మరి ఈ సినిమాతో నైనా దిల్ రాజు బౌన్స్ బ్యాక్ అవుతారా.. ఒకప్పటిలాగా సినిమా ఇండస్ట్రీని ఏలగలుగుతారా.. పైగా ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ లో రవితేజ, మరో హీరో సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే దిల్ రాజు సినిమా ఇండస్ట్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే దిల్ రాజు వ్యవహార శైలి పట్ల కొంతమంది నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు ఆయన నిర్మిస్తున్న సినిమాలు.. డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు దెబ్బతింటున్నాయి. స్థూలంగా చెప్పాలంటే దిల్ రాజుకు ఇప్పుడు గ్రహచారం బాగోలేదు..