Homeఅంతర్జాతీయంIran US War: ఇరాన్‌–అమెరికా యుద్ధం.. రంగంలోకి ఉక్రెయిన్‌!

Iran US War: ఇరాన్‌–అమెరికా యుద్ధం.. రంగంలోకి ఉక్రెయిన్‌!

Iran US War: పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడికి అమెరికా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు యుద్ధానికి భారీగా నిధులు సమకూర్చుకునే పనిలో పడింది. ఇదే సమయంలో ఇరాన్‌ కూడా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ప్రాక్సీల సహాయంతో గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్కసారిగా స్వరం మార్చారు. శాంతి మంత్రం అందుకున్నారు. అయితే ఇప్పటికే ట్రంప్‌ను నమ్మి మోసపోయిన ఇరాన్‌ ఇసారి శాంతి చర్చలకు సిద్ధంగా లేదు. ఈ తరుణంలో ఘర్షణలు పశ్చిమాసియాలో విస్తృత సంఘర్షణకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కాస్పియన్‌ జలాల్లో ఇరాన్‌ నౌకలపై ఉక్రెయిన్‌ చేసిన దాడులు. టెహ్రాన్‌ ఇప్పటికే కీవ్‌పై ప్రతీకార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇరాన్‌కు కాస్పియన్‌ కీలకమే..
ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపరచేందుకు అమెరికా హార్మూజ్‌ జలసంధితోపాటు పర్షియన్‌ గల్ఫ్, ఒమన్‌ గల్ఫ్‌లోని ముఖ్యమైన ఓడరేవులను నియంత్రణలోకి తీసుకుంది. పాకిస్తాన్‌ సహకారం అందుబాటులో లేని పరిస్థితిలో టెహ్రాన్‌ కష్టాలు ఎదుర్కొన్నా, వెనక్కి తగ్గలేదు. దీనికి కారణం కాస్పియన్‌ జలమార్గం. ఈ మార్గం ద్వారా రష్యా, మధ్య ఆసియా, చైనాతో నేరుగా వాణిజ్యం కొనసాగిస్తోంది. రష్యా నుంచి ధాన్యం, ఉక్కు వంటి వస్తువులు ఇక్కడి ద్వారా చేరుతున్నాయి. అంజలీ తదితర ఓడరేవులను ఇరాన్‌ నిర్వహిస్తోంది. ఇది టెహ్రాన్‌కు కీలక వాణిజ్య జీవనాధారంగా మారింది.

ఐదు దేశాల సరిహద్దు..
ఇరాన్‌ ఉత్తర సరిహద్దులో ఉన్న కాస్పియన్‌ వాస్తవానికి సముద్రం కాదు. విస్తీర్ణం అధికంగా ఉండటంతో పురాతన కాలం నుంచి గ్రీకులు, పర్షియన్లు దీన్ని సముద్రంగా పరిగణించారు. కాలక్రమేణా ఆ పేరే స్థిరపడింది. ప్రపంచంలో అతి పెద్ద సరస్సుగా ఇది నిలుస్తోంది. ఇరాన్, రష్యాతో పాటు మరో మూడు దేశాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి.

రష్యా–ఇరాన్‌ సహకారానికి వ్యూహాత్మక మార్గం
రష్యా, ఇరాన్‌ మధ్య అధికారిక రక్షణ ఒప్పందం లేకపోయినా, ఇటీవలి కాలంలో సైనిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం పెరిగింది. కాస్పియన్‌ ఈ కార్యకలాపాలకు ముఖ్య మార్గంగా పనిచేస్తోంది. మాస్కో నుంచి డ్రోన్‌ భాగాలు టెహ్రాన్‌కు ఇక్కడి ద్వారా చేరుతున్నాయి. ఫలితంగా ఇరాన్‌ సైనిక సామర్థ్యం వేగంగా తగ్గడం లేదని గతంలో అమెరికా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. రెండు దేశాల ఓడరేవుల మధ్య ప్రయాణించే కొన్ని నౌకలు ట్రాన్స్‌పాండర్లను తరచుగా నిలిపివేసి, ఆంక్షల పరిధిలోని చమురు, సైనిక సామగ్రిని సాఫీగా తరలిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఉక్రెయిన్‌ దాడులకు కారణాలు..
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇరాన్‌ నేరుగా పాల్గొనలేదు. అయితే యుద్ధ ప్రారంభ దశలో మాస్కోకు చౌక షాహెద్‌ డ్రోన్లు సరఫరా చేసింది. వాటిని కాస్పియన్‌ మార్గం ద్వారా పంపింది. 2024లో క్షిపణులు కలిగిన రష్యా కార్గో నౌక ఈ జలాల్లో ప్రయాణిస్తున్నట్లు అమెరికా నివేదికలు వెల్లడించాయి. అప్పటి నుంచి కీవ్‌ ఈ మార్గంపై దృష్టి సారించింది. గతేడాది ఆగస్టులో షాహెద్‌ డ్రోన్లు, ఇతర ఆయుధాలు తరలిస్తున్న ‘పోర్ట్‌ ఒల్యా 4’ నౌకపై దాడి జరిగింది. ఇటీవల ఈ దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్‌ ఓడరేవుల నుంచి బయలుదేరిన రెండు రష్యా నౌకలపై డ్రోన్లు వాడినట్లు కీవ్‌ ప్రకటించింది. రష్యా తీరం నుంచి బయలుదేరిన ఒక వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. ఈ సంఘటనలో ఇరాన్‌ సిబ్బంది ఒకరు మరణించారని టెహ్రాన్‌ తెలిపింది. ప్రతీకారం తీర్చుకుంటామని, కీవ్‌కు పాఠం నేర్పుతామని హెచ్చరించింది.

రష్యా సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యమని ఉక్రెయిన్‌ పేర్కొంటోంది. అంతేకాక గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులకు రష్యా సేకరించిన ఉపగ్రహ సమాచారం ఇరాన్‌కు అందుతోందని అధ్యక్షుడు జెలెన్సీ్క ఆరోపించారు. ఈ వారం జెలెన్సీ్క–ట్రంప్‌ భేటీలో ఈ అంశం చర్చకు రావచ్చు. అందువల్ల పశ్చిమాసియా పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper