AP Education System: దేశంలోని అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థలదే పైచేయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు ఏ స్థాయిలో దోచుకుంటున్నాయో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకూ అవి నీళ్లు వదులుతున్నాయి. ఫీజుల దోపిడీని ఆపాలని హెచ్చరిస్తున్నా.. సూచిస్తున్నా ఖాతరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్ వాటి మీద దూకుడుగా వెళ్తోంది. కార్పొరేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి వాటి రూపురేఖలు మారుస్తోంది. అయితే జగన్ అమలు చేసే ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ విధానాలు.. మోడీ సర్కార్ అమలు చేస్తున్న ‘‘జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)కి’’ అనుగుణంగా ఉన్నాయా? జగన్ విధానం.. కేంద్రం అమలు చేస్తున్న విద్యావిధానాన్ని అందుకోగలదా? అలాంటి సౌకర్యాలు ఏపీలో కల్పించగలడా? అన్నది ఇక్కడ ప్రశ్న.
-కేంద్రం నూతన విద్యావిధానం (ఎన్.ఈపీ)-2020 విధానంలో ఏముంది?
ప్రస్తుత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని ఎన్.ఈ.పీ2020 సిఫార్సు చేసింది. స్కూల్ విద్యను 5+3+3+4 మోడల్ లో రూపకల్పన చేయాలని..తదనుగుణంగా పాఠ్యప్రణాళిక, బోధన పద్ధతులను మార్చాలని సూచించింది. ఈ నూతన విద్యావిధానం స్కూల్ ఎడ్యూకేషన్ ను నాలుగు దశలుగా విభజించింది. ఇందులో మొదటిది 5 ఏళ్ల ఫౌండేషన్ స్టేజ్ ప్రీ ప్రైమరీ, గ్రేడ్ 1,2, ఇక రెండోది 3 ఏళ్ల ప్రీపరేటరీ స్టేజ్ గ్రేడ్ (3,4,5), మూడోది 3 ఏళ్ల మిడిల్ స్టేజ్ (గ్రేడ్ 6,7,8). ఇక నాలుగోది 4 ఏళ్ల సెకండరీ స్టేజ్ గ్రేడ్ (9,10,11,12).. ఈ విధానంలో పిల్లలను 3 ఏళ్ల వయసు వచ్చేనాటికి బడుల్లో చేర్చవచ్చు. వారికి 18 ఏళ్లు వచ్చే నాటికి స్కూల్ ఎడ్యూకేషన్ పూర్తి కావాలి. అయితే ఈ విద్యావిధానాన్ని జగన్, కేసీఆర్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయలేదు.
-జగన్ పైకి చెప్పటానికి బాగానే వున్నా ప్రభుత్వ స్కూళ్ల లో మౌలిక సౌకర్యాలు.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా వున్నాయా?
ఏపీ సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ అంటూ రూపురేఖలు మార్చారు. అయితే ఎంతగా మార్చినా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల లాంటి వసతులు ప్రభుత్వ స్కూళ్లలో లేవనే చెప్పాలి. మౌలిక వసతుల విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడాలు ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నాయి. సరైన ల్యాబ్ లు, గదులు, డిజిటల్ రూంలు, ఆధునిక విద్యాపోకడలు ప్రభుత్వ స్కూళ్లలో లేవు. ఆ దిశగా మన టీచర్లు సైతం నైపుణ్యం గల వారు లేరు. సో జగన్ అమలు చేయతలపెట్టిన ఈ పథకంలో ప్రభుత్వ స్కూళ్ల లో మౌలిక సౌకర్యాలు లేవన్నది అందరూ కాదనలేని వాస్తవం. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
-ఏపీ టీచర్లు స్కిల్స్ విషయంలో ఎలా ఉన్నారు?
ఏపీ సీఎం జగన్ ఘనంగా ఇంగ్లీష్ మీడియం చదువులు, సీబీఎస్ఈ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. కానీ ఆ దిశగా మన టీచర్లలో ఎంత వరకూ స్కిల్స్ ఉన్నాయి. వారు ఎంతలా అప్డేట్ అయ్యారన్నది మాత్రం ఆలోచించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వ టీచర్లు అంతా కేవలం తెలుగు మీడియంలో చదివినవారే.. తెలుగు మీడియం లోనే డీఎస్సీ రాసి టీచర్లుగా కొనసాగుతున్నారు.సడెన్ గా అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం చేసేశారు జగన్. కానీ ఒక్క ఇంగ్లీష్ టీచర్ నియామాకాలు చేపట్టలేదు. డీఎస్సీలు ఇంగ్లీష్ టీచర్ల కోసం వేయలేదు. సో ఇప్పుడు ఈ తెలుగు టీచర్లు పిల్లలకు ఇంగ్లీష్ లో బోధన ఎలా చేస్తారన్నది గండికోట రహస్యంగా మారింది. టీచర్లకు నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వలేదు. వాళ్లు అప్డేట్ కాలేదు. తెలుగు అకాడమీ మాత్రమే చెప్పే మన టీచర్లు.. జాతీయ స్థాయిలోకి ఆంగ్లంలో ఉండే సీబీఎస్ఈ సిలబస్ ఎలా చెబుతున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. ఇలాంటి సాధ్యాసాధ్యాలు ఏవీ పరిశీలించకుండానే సీఎం జగన్ ఏపీలో అమలు సిద్ధం కావడం ఆరంభ శూరత్వంగానే చెబుతున్నారు.
-పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలు ఏమేరకు వున్నాయి?
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలు అస్సలు లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ డిజిటల్ సౌకర్యాలతో విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి విషయ గ్రహణ శక్తిని పెంచాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని నగరాల్లో మాత్రమే.. కొన్ని పెద్ద స్కూల్స్ లో మాత్రమే ఈ సౌకర్యాలున్నాయి. ప్రతీ గ్రామంలోని పాఠశాలల్లో ఇవేవీ లేవు. మండలాల్లోనూ లేవు. సో ఈ డిజిటల్ విద్య లేకపోతే ప్రభుత్వ విద్యార్థులు వెనుకబడిపోతారు. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ లలో ఈ డిజిటల్ విద్య అత్యవసరం. మరి ఇవేవీ లేకుండా జగన్ సర్కార్ ఎలా ముందుకెళుతున్నది ప్రశ్న.
Also Read: Amaravati Farmers: అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే..?
ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టిన జగన్.. విద్యారంగంలో సమూల మార్పులు చేయాలని సంకల్పించారు. కానీ దానికి అనుగుణంగా సౌకర్యాలు మాత్రం లేవనే చెప్పాలి.. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. కానీ కేంద్ర పాఠశాలలకు , రాష్ట్ర పాఠశాలలకు సౌకర్యాల్లో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పాఠ్యపుస్తకాలను ముద్రించాలని నిర్ణయించిన జగన్ నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టిసారించారు. కానీ అలాంటి మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
గతేడాది అది దాదాపుగా 2.50 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వదిలి ప్రభుత్వ పాఠశాల్లలో అడ్మిషన్లు పొందారు. డబ్బులు ఆశచూపి పిల్లల్ని ప్రైవేటు వైపు తిప్పుకోవడం జగన్కు కాస్త ఇబ్బందిగా అనిపించి ఉంటుంది.. ప్రైవేట్ స్కూల్స్ కి కూడా అమ్మఒడి వర్తింపజేశారు. పిల్లల్ని స్కూల్కు పంపే ప్రతీ తల్లికి ఆర్థిక సాయం అందించారు.
ఇక ఈ ఏడాది ప్లాన్ పూర్తిగా మారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యారంగానికి ఏపీ ప్రభుత్వం 22,604 కోట్లు కేటాయించింది. అంటే ప్రభుత్వ విద్యకు జగన్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఇది ఖచ్చితంగా కొంత ప్రభావం చూపినా అందుకు అనుగుణంగా మౌళిక వసతులు కల్పించినప్పుడు మాత్రమే అమెరికా, పాశ్చాత్య దేశాల మాదిరిగా ఏపీలోనూ ప్రభుత్వ విద్య మారుతుంది. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. కేవలం పైపైన మెరుగులు దిద్ది సౌకర్యాలు కల్పించకపోతే ఆ స్థాయిని విద్యార్థులు అందుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోకుండా జగన్ సర్కార్ నాణ్యమైన విద్య అందించటం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: Pawan Kalyan Tweet Viral: పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడు చేస్తాడో తెలుసా?
Recommended Video:
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Will the changes in ap education bring good results
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com