Naravaripalli Chandrababu: నిత్యం బిజీగా ఉండే చంద్రబాబు సక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. సొంతూరు నారావారి పల్లిలో కుటుంబ సభ్యులతో మూడు రోజుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. పనిలో పనిగా పండుగ పూటే జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో దహనం చేసేశారు. ఇదంతా ఒక ఎత్తు. పండుగ పూట మనవడు దేవాన్ష్ చేసిన అల్లరి ఒక ఎత్తు. మనవడితో చంద్రబాబు ముచ్చట్లు, సరదాలు ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారాయి.

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. నారా, నందమూరి కుటుంబాలు చిత్తూరు జిల్లా నారావారి పల్లిలో వాలిపోతాయి. మూడు రోజుల పండుగను అక్కడే గ్రామస్థులతో కలిసి నిర్వహించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ఇంటి దేవత నాగాలమ్మ కట్ట వద్ద ఇంటిల్లిపాది పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన వేడుకలో చంద్రబాబు మనవడు దేవాన్ష్ అల్లరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. తాతను ఆటపట్టించిన తీరు అందరినీ ఆకర్షించింది.
చంద్రబాబు వద్దకు వెళ్లిన మనవడు దేవాన్ష్ .. తాతా నీ సీటు కావాలంటూ మారాం చేశారు. కొద్దిసేపు చంద్రబాబు వారించారు. చివరికి మనవడి డిమాండ్ ఒప్పుకోక తప్పలేదు. కుర్చీలోంచి లేచి దేవాన్ష్ కు చంద్రబాబు సీటు అప్పగించారు. దీంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు. తాత సీటుకే ఎసరు పెట్టిన మనవడు అంటూ ఆటపట్టించారు. ఆ తర్వాత బాలయ్య మనవళ్లతో ముచ్చట్లు పెట్టారు. మనవళ్లను ఆటపట్టించారు. వాటర్ బాటిల్ పై దేవాన్ష్ పై కొడుతూ అల్లరి చేశాడు బాలయ్య. తాతా మనవళ్ల ముచ్చట్లను జనం ఆసక్తిగా చూశారు.

చంద్రబాబు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూనే భోగి పండుగ సందర్భంగా జీవో నెంబర్ 1 పత్రాలను దహనం చేశారు. సంక్రాంతి , కనుమ రోజున స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోగా అభివర్ణించారు. మూడు రోజుల పాటు చంద్రబాబు, బాలయ్య కుటుంబం నారావారిపల్లిలో పండుగ కార్యక్రమాలు జరుపుకుంటారు. అనంతరం హైదరాబాద్ పయనమవుతారు.