Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక వింతైన, అద్భుతమైన “శాంతియుత” వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు గొంతు చించుకుంటూ, రేవంత్ రెడ్డి నిర్ణయాల మీద రచ్చ చేసిన ‘ఫైర్ బ్రాండ్’ నేతలంతా.. ఇప్పుడు ఎక్కడో లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక్క ‘రాజ్యసభ’ నిర్ణయంతో, ఈ సీనియర్లందరికీ అకస్మాత్తుగా ‘మౌన వ్రతం’ పట్టినంత జ్ఞానోదయం కలిగింది!
Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?
‘హైకమాండ్’ అంటే.. ఇక ఢిల్లీ కాదు!
గతంలో కాంగ్రెస్ అంటే “ఢిల్లీ వెళ్లాలి, ఫిర్యాదు చేయాలి, వేచి చూడాలి” అనే సామెత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ కాంగ్రెస్ దగ్గరకు వచ్చేసరికి “హైకమాండ్” అంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డేనని పార్టీ నేతలందరూ సర్టిఫై చేసేసుకున్నారు. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపి, “ఢిల్లీలో నా మాటే శాసనం” అని రేవంత్ తన మార్క్ పాలిటిక్స్‌తో స్పష్టమైన మెసేజ్ ఇచ్చేశారు. ఇంకేముంది? సీనియర్లందరూ తమ అసమ్మతి ఫైళ్లను అటక మీద పెట్టేసి, ఏసీ గదుల్లో కూర్చొని “రేవంత్ జిందాబాద్” అంటూ కంఠాపాఠం మొదలుపెట్టారు.
రాజగోపాల్ రెడ్డి కూడా.. ‘సైలెంట్’ వెర్షన్!
ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు సైతం, ఇప్పుడు “నోరు మెదపకపోవడమే మంచిది” అన్న యోగాసనంలో ఉన్నారు. తెర వెనుక వ్యూహాలు పన్నిన నేతలు కూడా, రేవంత్ చక్రవ్యూహం ముందు తాము కేవలం ‘పావులమే’ అని గుర్తించినట్టున్నారు. ఇప్పుడు వారికి రెండు ఆప్షన్లే ఉన్నాయి:
సైలెంట్ మోడ్: ఎవరూ చూడని చోట కూర్చొని మౌనంగా ఉండటం.
రేవంత్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూ, మీడియా మైకుల ముందు ‘స్తుతి’ పాడటం.
ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా, వారి రాజకీయ భవిష్యత్తుకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్నది లోకల్ టాక్.
కార్పొరేట్ స్టైల్.. హైకమాండ్ షాక్!
ఒకప్పుడు గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు రేవంత్ సారథ్యంలో ‘కార్పొరేట్ కంపెనీ’లా మారిపోయింది. టార్గెట్స్ రీచ్ అవ్వండి, లేదంటే ప్రమోషన్లు ఆగిపోతాయ్ అన్నట్టుగా ఆయన డీల్ చేస్తుంటే, సీనియర్లు అవాక్కవుతున్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలకు ఢిల్లీ అధిష్టానం కూడా ‘యెస్ బాస్’ అనక తప్పడం లేదు.
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కలహాల’ కాలం ముగిసి, ‘రేవంత్ శకం’ మొదలైంది. అసమ్మతి నేతలు ఇప్పుడు “మాకు అసంతృప్తి లేదు.. కేవలం విశ్రాంతి తీసుకుంటున్నాం” అని చెప్పుకోవడమే ఇప్పుడున్న ఏకైక మార్గం!