Roja: పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరిలో మాజీమంత్రి.. రోజా కన్నీరు పెట్టుకున్నారు. ఆమెకు వైసిపి కార్యకర్తలు తోడయ్యారు. అక్కడ మొత్తం హడావిడి జరగడంతో.. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోజాను.. ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రోజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు తాగునీరు ఇవ్వడానికి ఒక కార్యకర్త ప్రయత్నిస్తే.. ఆమె ఆ బాటిల్ మూత తీసి విసిరి కొట్టారు. కార్యకర్త మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానం ఫలితం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ స్థానంలో వైసిపి అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం టిడిపి అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. దీంతో నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి తమ పార్టీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారని వైసీపీ నేతలు వివరించారు. అధికార పార్టీ ఒత్తిడికి తలవంచి అధికారులు ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని.. మార్చి ప్రకటించారని ఆరోపించారు. తనమీద అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు బలవంతంగా కేంద్రం నుంచి బయటికి పంపించారని రోజా ఆరోపించారు.
కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత రోజా.. కార్యకర్తలతో కలిసి ప్రధాన గేటు ముందు బైఠాయించారు. నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అధికార కూటమి యంత్రాంగం కాలరాస్తోందని ఆరోపించారు. గెలిచిన తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్టు ప్రకటించడం.. ఓడిపోయిన టిడిపి అభ్యర్థిని విజేతగా ప్రకటించడం పట్ల ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
ఇల్లత్తూరు ఎంపిటిసి స్థానానికి రీకౌంటింగ్ నిర్వహించాలని.. పూర్తి పారదర్శకమైన విధానంలో ఫలితాలను వెల్లడించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని రోజా స్పష్టం చేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలను అధికారులు.. పోలీసులు పూర్తిగా ఖండించారు. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారమే సీసీ కెమెరాలు పర్యవేక్షణలో.. రెండు పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించినట్టు వివరించారు. లెక్కింపు పూర్తయిన తర్వాత.. నిబంధనల ప్రకారం లీడ్ లో ఉన్న అభ్యర్థికే ధ్రువీకరణ పత్రం అందించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు పంపించారు.