Kawasaki Z650 S : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి (Kawasaki) భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. తన పాపులర్ Z సిరీస్‌లో భాగంగా 2027 మోడల్ Kawasaki Z650 Sను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త బైక్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.7.59 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. స్టాండర్డ్ Z650తో పోలిస్తే కొత్త Z650 S ధర రూ.33,000 ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సాధారణ Z650 ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.26 లక్షలుగా ఉంది.
కొత్త మోడల్‌లో ప్రధానంగా డిజైన్, రైడింగ్ పొజిషన్, టెక్నాలజీ పరంగా మార్పులు చేశారు. ముఖ్యంగా కొత్త LED లైటింగ్, 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లను అందించారు. అయితే ఇంజిన్, ఇతర ప్రధాన మెకానికల్ అంశాల్లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.
మరింత అగ్రెసివ్ లుక్‌తో కొత్త డిజైన్
2027 Kawasaki Z650 S డిజైన్‌లో సంస్థకు చెందిన Sugomi డిజైన్ లాంగ్వేజ్‌ను కొనసాగించారు. అయితే గత మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా, అగ్రెసివ్‌గా కనిపించేలా బాడీ డిజైన్‌ను మార్చారు. ముఖ్యంగా Z900 నుంచి స్ఫూర్తి పొందిన కొత్త LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ముందు భాగంలో పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్లు, పదునైన బాడీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. అల్యూమినియం రేడియేటర్ కవర్లు, పైకి ఎత్తినట్లుగా కనిపించే రియర్ సెక్షన్ బైక్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. హ్యాండిల్‌బార్‌ను కూడా వెడల్పుగా మార్చడంతో పాటు కొంచెం ముందుకు తీసుకొచ్చారు. దీంతో రైడర్‌కు మరింత కమిటెడ్ రైడింగ్ పొజిషన్ లభిస్తుంది.
పెరిగిన సీట్ హైట్.. బరువు కూడా ఎక్కువే!
కొత్త Z650 Sలో సీటు ఎత్తును 790 మిల్లీమీటర్ల నుంచి 805 మిల్లీమీటర్లకు పెంచారు. బైక్ కెర్బ్ వెయిట్ 193 కిలోలుగా ఉంది. ఇది పాత Z650 కంటే 5 కిలోలు ఎక్కువ. అయితే ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లుగానే కొనసాగుతోంది. గ్రౌండ్ క్లియరెన్స్ 130 మిల్లీమీటర్లుగా ఉంది.
ఈ మోటార్‌సైకిల్‌ను ప్రస్తుతం Pearl Blizzard White, Candy Lime Green కలర్ కాంబినేషన్‌లో ఒకే రంగు ఆప్షన్‌తో అందిస్తున్నారు. ఇందులో పూర్తి LED లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
అదే పవర్‌ఫుల్ 649cc ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే కొత్త Kawasaki Z650 Sలో పాత 649cc లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 8,000rpm వద్ద 67bhp పవర్‌ను, 6,700rpm వద్ద 64Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
కొత్తగా అందించిన అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఈ బైక్‌లో కీలకమైన అప్‌డేట్. దీని వల్ల క్లచ్ లివర్ ఆపరేషన్ సులభంగా మారుతుంది. ముఖ్యంగా వేగంగా గేర్లు తగ్గించే సమయంలో వెనుక చక్రంపై ఏర్పడే అస్థిరతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా క్లచ్ ఉపయోగించకుండా గేర్లు పైకి మార్చుకునేందుకు క్విక్‌షిఫ్టర్‌ను ఆప్షనల్ యాక్సెసరీగా అందిస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
బ్రేకింగ్ సిస్టమ్‌లో మార్పులు
సస్పెన్షన్ విభాగంలో ముందు RSU ఫోర్క్, వెనుక బ్యాక్‌లింక్ మోనోషాక్ సెటప్‌ను కొనసాగించారు. అయితే బ్రేకింగ్ సిస్టమ్‌లో మాత్రం మార్పులు చేశారు. ముందు భాగంలో గతంలో ఉన్న 300mm డిస్కుల స్థానంలో 272mm ట్విన్ డిస్కులను ఏర్పాటు చేశారు. వెనుక డిస్క్ పరిమాణాన్ని 220mm నుంచి 186mmకు తగ్గించారు.
4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ
టెక్నాలజీ పరంగా కొత్త Z650 Sలో 4.3 అంగుళాల కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇందులో వాహనానికి సంబంధించిన కీలక సమాచారం, రైడింగ్ లాగ్స్, ఎంపిక చేసిన నోటిఫికేషన్లను చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయం ఉండటంతో ప్రయాణ సమయంలో మార్గాలను సులభంగా తెలుసుకోవచ్చు.
Z సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తాం: కవాసాకి
ఇండియా కవాసాకి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ యుటాకా యమషిత మాట్లాడుతూ.. భారతదేశం కవాసాకికి అత్యంత ముఖ్యమైన మోటార్‌సైకిల్ మార్కెట్లలో ఒకటని తెలిపారు. 1972లో ప్రారంభమైన దిగ్గజ Z1 నుంచి కవాసాకి Z సిరీస్ సవాళ్లను స్వీకరించడం, కొత్త ఆవిష్కరణలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. కొత్త Z650 S కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ భారతీయ రైడర్లకు ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2027లో Z సిరీస్ 55వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో భారత్‌లో ఈ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
2027 Kawasaki Z650 Sలో ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా.. కొత్త డిజైన్, మెరుగైన రైడింగ్ పొజిషన్, TFT డిస్‌ప్లే, స్లిప్పర్ క్లచ్ వంటి అప్‌డేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. రూ.7.59 లక్షల ధరతో ప్రీమియం మిడిల్‌వెయిట్ నేకెడ్ బైక్ విభాగంలో ఈ మోడల్ ఎంతవరకు వినియోగదారులను ఆకట్టుకుంటుందో చూడాలి.