Telangana Housing Lucky Draw: ఎవరికైనా సరే ఇల్లు అనేది ఒక సెంటిమెంట్. ఒక ఎమోషన్. ఇక పేదలకు అయితే అది మరింత బలంగా ఉంటుంది. అందువల్లే రెక్కలు ముక్కలు చేసుకొని.. రూపాయి రూపాయి కూడా పెట్టి పేదలు తమకు తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకుంటారు. దానిని ఒక సౌధం లాగా భావిస్తూ ఉంటారు.
అటువంటి పేదలకు ప్రభుత్వం నుంచి అనుకోకుండా వరం వస్తే.. ఎన్నో సంవత్సరాలుగా కలుగంటున్న ఇల్లు కళ్ళ ముందు కనిపిస్తే.. అంతకుమించిన ఆనందం మరొకటి ఏముంటుంది.. ఈ దృశ్యం శుక్రవారం చోటుచేసుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని మైలార్ దేవ్ పల్లి పరిధిలోని లక్ష్మీగూడా లో నిర్వహించిన గృహాల లక్కీ డ్రా టోకెన్ లో అద్భుతం చోటుచేసుకుంది. ఈ లక్కీ డ్రాను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక బాలుడితో తీయించారు. అయితే ఆ బాలుడు తీసిన చీటీలో ఒక అద్భుతం చోటుచేసుకుంది.
ఆ బాలు తీసిన చీటీలో అతని కుటుంబం పేరు ఉండడం విశేషం. స్వయంగా ఈ పేరును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కమిషనర్ వెల్లడించారు. దీంతో ఆ బాలుడి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలుడిని ఎత్తుకున్న ఆ తల్లి ఒకసారిగా కన్నీటి పర్యంతమైంది. అదే సమయంలో మంత్రి శ్రీనివాసరెడ్డి ఆ తల్లిని అభినందించారు.. బాలుడు చీటి తీస్తే మీ కుటుంబం పేరు వచ్చిందని.. రాఖీ పౌర్ణమి సందర్భంగా మీకు గృహ యోగం లభించిందని మంత్రి వ్యాఖ్యానించారు.
పేదలకు ఎటువంటి రాజకీయ పైరవీకి ఆస్కారం లేకుండా ప్రభుత్వం గృహాల కేటాయింపు జరుపుతోంది. ముఖ్యంగా లక్కీ డ్రా లో పేదలకు గృహాలను కేటాయిస్తోంది. లక్కీ డ్రా కూడా వారి చేతుల మీదుగానే నిర్వహిస్తోంది. పారదర్శకతకు నూటికి నూరు శాతం పెద్దపీట వేస్తూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగుతోంది. లక్కీ డ్రా లో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని పాటిస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
గతంలో ప్రభుత్వం తరఫునుంచి గృహాలు మంజూరు కావాలంటే పైరవీలు చేసుకోవాల్సి వచ్చేదని.. ఇప్పుడు ఆ అవకాశం లేదని.. ప్రభుత్వం నూటికి నూరు శాతం పారదర్శకతకు పెద్దపీట విస్తరణ నేపథ్యంలో తమలాంటి వాళ్లకు గృహాలు లభిస్తున్నాయని.. ఇది ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశం అని లబ్ధిదారులు అంటున్నారు. అయితే కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా గృహాల కేటాయింపులో ఇదేవిధంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.
అదృష్టం అంటే ఇదేనేమో..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా టోకెన్ ను ఒక చిన్నోడితో తీపించినపుడు ఆ చిన్నోడి కుటుంబానికే వరించిన ఇల్లు.
పేదల సొంతింటి కల తీర్చాలనే ఈ ప్రభుత్వ సంకల్పానికి, దేవుడి ఆశీస్సులు తోడైనట్టు… pic.twitter.com/JgDNSWhVTR
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) August 28, 2026