Karimnagar Granite Scam: గ్రానైట్‌కు ఖమ్మం తర్వాత తెలంగాణలో కరీంనగర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఈ వ్యాపారంగా విస్తరించింది. కరీంనగర్ గ్రానైట్‌కు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది వ్యాపారులు ఈరంగంలోకి దిగారు. యూనియన్‌గా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు. అయితే అధికారుల అండతో ఈ వ్యాపారులు అక్రమ మైనింగ్, ఎగుమతులకు తెరలేపారు. దీనిపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గతంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశారు. రూ.749 కోట్ల సీనరేజీ (రోయల్టీ) నిధుల ఎగవేతతోపాటు రూ.వేల కోట్ల విలువైన అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం పీఎంవో దృష్టి సారించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీబీఐ, ఎన్‌జీటీ, జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ విభాగాలకు ఫిర్యాదులు అందడంతో త్వరలోనే కేంద్ర దర్యాప్తు బృందాలు జిల్లాకు రానున్నాయి.
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
రూ.వేల కోట్ల అక్రమాలు
ఈ గ్రానైట్ స్కాం కేవలం చిన్న మొత్తం కాదు – ఇది భారీ ఎత్తున జరిగిన అక్రమాల సమూహం. రూ.749 కోట్ల రాయల్టీ నిధులు ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశారు. రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్ అక్రమంగా తవ్వి, అమ్మకం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశీ మారకద్రవ్య నిబంధనల (ఫెమా) ఉల్లంఘనపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదులు ఇలా..
అక్రమాలు, అవినీతిపై ప్రధాని కార్యాలయం దృష్టికి రావడంతో పాటు, ఈ కేసును అనేక కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేస్తోంది. ఎన్‌జీటీ కూడా పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరుపుతోంది. జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ పన్ను ఎగవేత, ఆర్థిక మోసాలపై విచారణ జరుపుతుంది. ఫెమా ఉల్లంఘనపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
అక్రమాల ఆధారాలు..
తెలంగాణ విజిలెన్స్ శాఖ ఈ కేసుపై సమగ్ర నివేదిక తయారు చేసింది. లైసెన్స్ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు జరిపినట్లు తెలిపింది. వసూలు చేసిన రాయల్టీ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్లించారని పేర్కొంది. మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించింది. గ్రానైట్ బ్లాకులను అక్రమంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలించడంలో రవాణా శాఖ అక్రమాలు చేసినట్లు తెలిపింది.
ఫెమా ఉల్లంఘన..
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఫెమా (విదేశీ మారకద్రవ్య నిబంధనల చట్టం) ఉల్లంఘన. గ్రానైట్ ఎగుమతుల ద్వారా వచ్చిన విదేశీ మారకద్రవ్యం సరైన ఛానల్స్ గుండా రాలేదు. విదేశీ ఖాతాల్లో డబ్బు దాచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం రాష్ట్ర స్థాయి నేరం కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.
