Corporate Schools: ఉత్తమమైన విద్య అందుతుందని.. ఉపాధ్యాయులు మెరుగ్గా బోధన చేస్తారని.. తమ పిల్లలు ప్రయోజకులవుతారని చాలామంది తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలలకు పంపిస్తుంటారు. అప్పులు తెచ్చి అయినా సరే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తుంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండవని.. ఉపాధ్యాయులలో జవాబుదారితనం కనిపించదని.. పిల్లలకు సక్రమమైన విద్య అందదని భావించే తల్లిదండ్రులు.. తమ స్తోమతకు మించినా సరే పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తుంటారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడి.. విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించి.. మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. పైగా ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన చోట దారుణంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న దమ్మాయిగూడ లో శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల మధ్య ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక పదవ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు కర్రలతో కొట్టారు. బూటు కాళ్లతో తన్నారు.. ఈ విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థుల దాడిలో గాయపడిన అభిషేక్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఆసుపత్రి యాజమాన్యం మరో విధంగా చిత్రీకరించడం మొదలుపెట్టింది. ఆ విద్యార్థి మెట్లపై నుంచి పడినట్టు చెబుతోంది. వాస్తవానికి విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేలాగా యాజమాన్యం కృషి చేయాలి. విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం బాటలు పరచాలి. తోటి విద్యార్థుల మధ్య ఈ స్థాయిలో ర్యాగింగ్ జరిగింది అంటే అది ముమ్మాటికి యాజమాన్యం నిర్లక్ష్యమే.
ఉన్నతమైన చదువులు చెప్తారని శ్రీ చైతన్య లో చేర్పించాం. భారీగా ఫీజులు కూడా చెల్లిస్తున్నాం. అయినప్పటికీ ఇక్కడ విద్యార్థులకు సరైన సెక్యూరిటీ లేదు. తోటి విద్యార్థులు ఒకరిని ఒకరు కొట్టుకుంటుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తోంది.. విద్యార్థులను పర్యవేక్షించాలి కదా.. నిత్యం కనిపెట్టుకొని ఉండాలి కదా. ఇంతలా దాడులు చేసుకున్నారంటే ఏమనుకోవాలి.. ర్యాగింగ్ విష సంస్కృతి ఈ స్థాయిలో పెచ్చరిల్లిపోతుంటే మేనేజ్మెంట్ నిశ్శబ్దంగా ఉంది.. మా అబ్బాయి పరిస్థితి చూస్తే దారుణంగా ఉందని అభిషేక్ తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి దీనిపై యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు.