Sunrisers Hyderabad captain 2026: ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్లను నియమించాయి. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే ఇందులో హైదరాబాద్ జట్టుకు విచిత్రమైన సమస్య ఎదురవుతోంది. దీంతో ఎటు తేల్చుకోవాలో తెలియక ఆ జట్టు యాజమాన్యం తికమక పడుతోంది. నిన్న క్రికెట్ సర్కిల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గురించి చర్చ నడిచింది. కమిన్స్ ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉంటాడని.. అతడి స్థానంలో అభిషేక్ శర్మ జట్టును నడిపిస్తాడని వార్తలు వినిపించాయి.
అభిషేక్ శర్మను సారధిగా నియమించారని.. అతడు హైదరాబాద్ జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తాడని కొన్ని జాతీయ చానల్స్ స్పష్టం చేశాయి. దీంతో 2026 ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లలో హైదరాబాద్ జట్టుకు సారధిగా అభిషేక్ శర్మ ఖాయమని అందరూ అనుకున్నారు. కొందరు కావ్య నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు.
అభిషేక్ శర్మ మాత్రమే కాకుండా, ఇషాన్ కిషన్ కు కూడా సామర్థ్యం ఉండడంతో.. అతడిని కూడా సారధి గా నియమిస్తే బాగుండని విశ్లేషణలు వినిపించాయి. అంతేకాదు, ఇషాన్ కిషన్ కు అదనపు సామర్ధ్యాలు ఉన్నాయని.. అతడు 2016 వరల్డ్ కప్ లో ఇండియాకు, డొమెస్టిక్ క్రికెట్లో ఝార్ఖండ్ జట్టుకు నాయకుడిగా పనిచేశాడని.. అందువల్లే హైదరాబాద్ జట్టు సారధిగా అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ ఎవరనేది సందిగ్ధంగా మారింది.
కమిన్స్ ఇంతవరకు తన సామర్థ్యాన్ని పొందలేదు. అతడు ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియడం లేదు. వెన్ను నొప్పి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అతడు ఇంకా కొద్దిరోజుల పాటు మైదానానికి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. నొప్పి తీవ్రత వల్లే అతడు టి20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్(ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు) కు దూరంగా ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆడినప్పటికీ అతడు తన స్థాయి బౌలింగ్ చేయలేకపోయాడు. ఇప్పుడు కమిన్స్ జట్టులో చేరతాడా? ఒకవేళ చేరినా ఆ స్థాయిలో ఆడతాడా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కావ్య మదిలో అభిషేక్ శర్మను కెప్టెన్ చేయాలి అన్నట్టుగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే అభిషేక్ శర్మ గత కొద్ది సీజన్లుగా హైదరాబాద్ జట్టు కు తిరుగులేని పరుగులు అందిస్తున్నాడు. ఓపెనర్ గా అతడు అద్భుతమైన రికార్డులు అందుకున్నాడు. అందువల్లే అతని వైపు కావ్య ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కనక జరిగితే అభిషేక్ శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు ప్రారంభ మ్యాచ్ లు ఆడుతుంది.