Homeక్రీడలుక్రికెట్‌Royal Challengers Bangalore IPL 2026 analysis: బెంగళూరు మరోసారి భళా అనిపిస్తుందా? జట్టు సామర్థ్యం,...

Royal Challengers Bangalore IPL 2026 analysis: బెంగళూరు మరోసారి భళా అనిపిస్తుందా? జట్టు సామర్థ్యం, బలహీనతలు ఇవే!

Royal Challengers Bangalore IPL 2026 analysis: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అభిమానుల బలమున్న జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పేరు ఉంది. 2008 నుంచి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతిసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం.. ఓడిపోవడం పరిపాటిగా మార్చుకుంది. 2025 లో బెంగళూరు చరిత్రను తిరగరాసింది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించి.. తొలిసారి ట్రోఫీని అందుకుంది.

ఈసారి మరింత కొత్తగా..
ప్రస్తుత సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బెంగళూరు బరిలోకి దిగుతోంది. భయంకరమైన ప్లేయర్లతో అత్యంత బలంగా కనిపిస్తోంది బెంగళూరు జట్టు. గతంలో ఉన్న లోపాలను సవరించుకొని.. అద్భుతమైన ప్రదర్శన చేసే ప్లేయర్లను భర్తీ చేసుకొని.. బెంగళూరు జట్టు బలంగా కనిపిస్తోంది.

గత మ్యాజిక్ రిపీట్ చేయాలని..
గత సీజన్లో బెంగళూరు జట్టులో ప్రతి ఆటగాడు సమర్థవంతమైన పాత్ర పోషించారు. అందువల్లే 18 సీజన్ల పాటు ఎదురైన నిరాశకు స్వస్తి పలికారు. మొత్తంగా ట్రోఫీ సాధన కలను సాకారం చేసుకున్నారు. అయితే గత సీజన్లో చూపించిన ప్రదర్శనను.. ఈసారి కూడా రిపీట్ చేయాలని బెంగళూరు ప్లేయర్లు భావిస్తున్నారు.

ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ
బెంగళూరు జట్టులో కీలకమైన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో 18 సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పరిధిన ఘనత సాధించాడు. గడిచిన 18 సీజన్ల పాటు ఐపీఎల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. 8,661 పరుగులు చేశాడు. అన్ని సీజన్లను కలిపి 771 బౌండరీలు, 291 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. ఆర్సిబికి మరోసారి ట్రోఫీ అందించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.

ఇదీ జట్టు ముఖచిత్రం
బెంగళూరులో టీమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్, జాబ్ బెతల్ వంటి ప్లేయర్లు కీలకంగా ఉన్నారు. వీరి ముగ్గురి మీద బెంగళూరు భారీ అంచనాలు పెట్టుకుంది. వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్ వంటి ప్లేయర్లు అటు బంతి, ఇటు బ్యాట్ తో ఆకట్టుకోగలరు. భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్, యష్ దయల్, సుయాష్ శర్మ, రషీర్ సలాం, అభినందన్ వంటి ప్లేయర్లతో బెంగళూరు బలంగా కనిపిస్తోంది.

Also Read: సన్ రైజర్స్.. ఈసారైనా సత్తా చూపిస్తుందా.. బలాలు.. బలహీనతలు ఇవే!

బ్యాటింగ్ విభాగంలో..
బెంగళూరులో భీకరమైన బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థులకు పెను సవాల్ ఎదురుకానుంది. సీజన్లో వెంకటేష్ అయ్యర్, రోమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన చేశారు. జాకబ్ బెతల్ ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మీద సూపర్ సెంచరీ చేశాడు. అతడికి టీమ్ ఇండియా మైదానాలు కొట్టినపిండి. అలాంటప్పుడు బెంగళూరు ప్రత్యర్థి జట్లకు బలమైన పోటీ ఇవ్వగలుగుతుంది.

బౌలింగ్ విభాగంలో..
బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, హెజిల్ వుడ్ కీలకంగా ఉన్నారు. ఈసారి కూడా వీరిద్దరూ తమ మిస్టరీ బౌలింగ్ కొనసాగిస్తే ప్రత్యర్థి జట్లకు ఇబ్బంది తప్పదు. అయితే హేజిల్ వుడ్ గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్లాట్ మైదానాలుగా పేరుపొందిన ఇండియన్ పిచ్ ల మీద వుడ్ ఆ స్థాయిలో బౌలింగ్ చేయగలుగుతాడా.. అనే అనుమానం బెంగళూరు అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఇక బెంగళూరులో పాత, కొత్త ప్లేయర్ల కలయిక ఉంది. వీరంతా కూడా బెంగళూరు జట్టను ఈ ఐపీఎల్ లో ఎలా ముందుకు నడిపిస్తారనేది చూడాల్సి ఉంది.

ముగింపు
గత సీజన్లో బ్యాటింగ్ పరంగా బెంగుళూరు సరికొత్త రికార్డులు సృష్టించింది. బౌలింగ్ పరంగా కూడా సరికొత్త ఘనతలు అందుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేస్తే బెంగళూరుకు తిరుగుండదని అభిమానులు అంచనా వేస్తున్నారు. సమర్థవంతమైన ప్లేయర్లను జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఈసారి ప్రత్యర్ధులకు అసలు సిసలైన పోటీ ఎదురవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ బెంగళూరు ఈసారి రెట్టించిన ఉత్సాహంతో కనుక ఆడితే.. మరోసారి ఛాంపియన్ గా ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక సమయంలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తారని అపప్రద ఉంది. ఒకవేళ అదే గనుక జరిగితే బెంగళూరుకు ఈసారి భంగపాటు తప్పదు. అయితే బ్యాటింగ్ విభాగంలో బెతల్, విరాట్ కోహ్లీ విఫలమైతే బెంగళూరు మూల్యం చెల్లించుకోక తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular