Smriti Mandhana Wedding Canceled: భారత మహిళా క్రికెట్ జట్టులో లేడీ విరాట్ కోహ్లీ గా పేరు తెచ్చుకుంది స్మృతి మందాన. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్ గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో రికార్డులను సాధించిన స్మృతి.. ఇటీవల భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
స్మృతి మందాన పలాష్ ముచ్చల్ అనే బాలీవుడ్ సంగీత దర్శకుడి తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇటీవల టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత స్మృతికి ముచ్చల్ మైదానంలో వినూత్నంగా ప్రపోజ్ చేశాడు. దానికి స్మృతి మురిసిపోయింది. భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత కొద్ది రోజులకే స్మృతి తన పెళ్ళికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. త్వరలోనే తాను ముచ్చల్ తో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నట్టు వెల్లడించింది.
దీనికి తగ్గట్టుగానే మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో స్మృతి, ముచ్చల్ పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆ పెళ్ళికి సంబంధించి ముందస్తు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు సఫాలీ వర్మ, జేమీమా సందడి చేశారు.. మరి కాసేపట్లో వివాహం అనగా పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి అంబులెన్స్ వచ్చింది. అందులో స్మృతి తండ్రి శ్రీనివాస్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
శ్రీనివాస్ ఆసుపత్రి పాలు కాగానే, స్మృతి కి కాబోయే భర్త ముచ్చల్ కూడా ఆసుపత్రి పాలయ్యాడు. అతడు కూడా జ్వరంతో బాధపడుతున్నాడని, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఫోటోలను స్మృతి డిలీట్ చేసింది. ఆమె సహచర క్రికెటర్లు కూడా ఫోటోలను, వీడియోలను డిలీట్ చేశారు.. కష్టకాలంలో స్మృతికి అండగా ఉంటున్నామని ప్రకటించారు. అయితే త్వరలోనే పెళ్లి జరుగుతుంది అనుకుంటుండగా ఇంతలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ముచ్చల్ ను వివాహం చేసుకోవడం లేదని.. తమ వివాహం రద్దయిందని స్మృతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో వీరిద్దరి మధ్య బంధం పెటాకులయిందని చర్చ మొదలైంది.. ” కొంతకాలంగా నా వ్యక్తిగత జీవితం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.. ఈ సందర్భంగా నా జీవితంలో చోటు చేసుకున్న ఒక విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను.. ముచ్చల్ తో నా వివాహాన్ని రద్దు చేసుకున్నాను.. ఇకపై టీమిండియా కు ట్రోఫీలు అందించడం పైనే దృష్టి పెడతాను.. ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీ కి భంగం కలిగించకుండా ఉంటారని ఆశిస్తున్నానని” స్మృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.