ENG vs WI T20 World Cup 2026: వెస్టిండీస్ ఒకప్పుడు ఛాంపియన్. అన్ని రంగాలలో అదరగొట్టిన జట్టు అది. ప్రపంచ జట్లను బెదిరగొట్టిన టీం అది. కాలక్రమంలో వెస్టిండీస్ జట్టు తన స్థాయిని కోల్పోయింది. ఫలితంగా చిన్న స్థాయి జట్టుకు తన రేంజ్ తగ్గించుకుంది. కొన్ని సందర్భాల్లో అయితే చిన్న జట్లపై కూడా ఓడిపోయి పరువు తీసుకుంది.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జట్టు గాయపడ్డ సింహం మాదిరిగా ఆడుతోంది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం వెస్టిండీస్ జట్టుకు అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అయితే ఆ విజయం ఇచ్చిన ఊపులో వెస్టిండీస్ ప్లేయర్లు రెచ్చిపోయారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సమష్టి ప్రదర్శన చేశారు. బ్యాటింగ్.. బౌలింగ్ లో అదరగొట్టి సత్తా చూపించారు.
ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ ఐదో బంతికే 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ తొలి బంతికే రెండవ టికెట్ కూడా కోల్పోయింది. ఈ దశలో హిట్ మేయర్ (23), చేజ్(34) సమర్థవంతంగా ఆడారు. మూడో వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టదిట్టంగా బంతులు వేశారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు వికెట్లు కోల్పోయింది . ఈ నేపథ్యంలో రూథర్ఫోర్డ్ (76*), హోల్డర్ (33) అదరగొట్టడంతో వెస్టిండీస్ జట్టు 196 పరుగులు చేసింది.
197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు దాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు సాల్ట్ (30), బట్లర్ (21), బెతల్(33) అదరగొట్టారు. ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు 85/3 వద్ద నిలిచింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైంది. కేవలం 20 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్ లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఓటమి ఖాయం అయిపోయింది. వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ గొప్పగా ప్రారంభించలేదు. ఆ తర్వాత కుదురుకుంది. ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో ఇన్నింగ్స్ ఘనంగా మొదలు పెట్టింది. ఆ తర్వాత ఒత్తిడి గురి అయింది. ఈ అంతరమే ఇంగ్లాండ్ జట్టు నుంచి గెలుపును వెస్టిండీస్ జట్టుకు చేరువ చేసింది.