Tirumala Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవముగా భావించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏడాదికి ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే శ్రీవారి దర్శనం కొత్త అనుభూతిని ఇవ్వగా.. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఆ స్వామివారి దర్శనం మరింత వైభవాన్ని కలిగిస్తుంది. అందుకే చాలామంది బ్రహ్మోత్సవాలకు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. ఇందులో భాగంగా 2026 ఏడాదికి సంబంధించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
సెప్టెంబర్ నెలలో శ్రీవారి ఆలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, 5న శిక్యోత్సవం, 6 న బలరామ జయంతి, వరాహ జయంతి నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 14 వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 15 నుంచి 23 వరకు ఏ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన గరుడసేవను నిర్వహించనున్నారు. ఈ సేవను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి తరలి రానున్నారు. ఈ గరుడ సేవలో ముక్కోటి దేవతలు, అష్టదిక్పాలకులు పాల్గొంటారని భక్తుల నమ్మకం. ఏడాదిలో మిగతా రోజుల్లో కేవలం మూలవిరాట్ కు అలంకరించే అత్యంత విలువైన లక్ష్మీ హారం ఈ రోజున మలయప్ప స్వామికి అలంకరిస్తారు. అందుకే ఈ దర్శన భాగ్యం కోసం పోటీ పడతారు.
సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణ రథం, 22న రథోత్సవం నిర్వహించనున్నారు. 23న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సువారి కార్యక్రమాలు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే సాధారణంగా ఉదయం వాహన సేవలు 8 నుంచి 10 గంటల వరకు.. రాత్రి వాహన సేవలో ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతాయి. కానీ గరుడసేవ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.