చాలా సందర్భాల్లో మనం చేసిన చిన్నచిన్న తప్పులే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఎవరినైనా మనం మోసం చేస్తే ఆ మోసం వెలుగులోకి వచ్చిన సమయంలో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాడు. భార్య క్రెడిట్ కార్డును వినియోగించి ప్రియురాలి ట్రాఫిక్ ఫైన్లు కట్టిన సదరు వ్యక్తి విషయం భార్యకు తెలిసి ఇబ్బందుల్లో పడ్డాడు.
ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే గర్ల్ ఫ్రెండ్ కు ఆ వ్యక్తికి పెళ్లైందని తెలియదు. పూర్తి వివరాల్లోకి వెళితే దుబాయ్ కు చెందిన ఒక మహిళ క్రెడిట్ కార్డును ఆమె, ఆమె భర్త వినియోగించేవారు. ప్రతి నెలా పరిమితంగా భార్య, భర్త క్రెడిట్ కార్డును వినియోగించేవారు. అయితే ఆ మహిళ క్రెడిట్ కార్డు నుంచి కొన్ని రోజుల పాటు భారీ మొత్తంలో ట్రాఫిక్ ఫైన్ల చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి.
భారీగా లావాదేవీలు జరగడంతో సదరు మహిళ బ్యాంకు సిబ్బందిని సంప్రదించి క్రెడిట్ కార్డ్ లావాదేవీల గురించి ప్రశ్నించింది. ఒక యువతి ట్రాఫిక్ ఫైన్లను ఆ కార్డుతో చెల్లించిందని తెలిసి సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా తన ప్రియుడి క్రెడిట్ కార్డును తాను వినియోగిస్తున్నానని ఆమె పోలీసులకు తెలిపింది.
ఆ తరువాత పోలీసులు మహిళ భర్త, విచారించిన యువతి ప్రియుడు ఒకరే అని తెలుసుకుని అవాక్కయ్యారు. పోలీసులు ఆ కార్డు ప్రియుడి భార్య క్రెడిట్ కార్డ్ అని అతని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పగా ఆమెకు నోట మాట రాలేదు. చేసిన చిన్న తప్పు వల్ల భార్య, గర్ల్ ఫ్రెండ్ కు ఒకేసారి నిజం తెలియడంతో సదరు భర్త ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడని తెలుస్తోంది.