bisleri : మంచినీరు తాగుతున్నామనే నమ్మకంతో చాలామంది మినరల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన నీటిని ఎలాంటి సందేహం లేకుండా వినియోగిస్తుంటారు. అయితే తాజాగా బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించిన వివాదం బాటిల్ వాటర్ నాణ్యతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. నీటిలో హానికరమైన రసాయనాలు ఉంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వినియోగదారుల్లో మొదలైంది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్వహించిన పరీక్షల్లో బిస్లెరీకి చెందిన ఒక నీటి నమూనా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో సంస్థపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇచ్చింది. తొలుత నిర్వహించిన పరీక్షల్లో బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించగా, రిఫరల్ ల్యాబొరేటరీ పరీక్షల్లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు వెల్లడైంది.
అయితే ఈ వ్యవహారం మొత్తం బిస్లెరీ ఉత్పత్తులకు సంబంధించినది కాదు. గోవాలోని తమ తయారీ కేంద్రంలో 2025 సెప్టెంబర్‌లో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్ నుంచి సేకరించిన నమూనాకు సంబంధించినదని కంపెనీ వెల్లడించింది. తమ స్వతంత్ర పరీక్షల్లో బ్రోమేట్ స్థాయులు అనుమతించిన పరిమితుల్లోనే ఉన్నాయని పేర్కొంటూ, పరీక్షా ఫలితాలపై వివరణ కోరింది.
క్యాన్సర్ ముప్పు ఉందా?
బ్రోమేట్, కొన్ని రకాల PAHs రసాయనాలు దీర్ఘకాలం అధిక స్థాయిలో శరీరంలోకి చేరితే ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కసారి కలుషిత నీరు తాగినంత మాత్రాన క్యాన్సర్ వస్తుందని భావించకూడదు. రసాయనం మోతాదు, ఎంతకాలం దానికి గురయ్యారు అనే అంశాలు కీలకం.
బాటిల్ కొనేముందు ఇవి చూడండి!
నీటి బాటిల్ కొనుగోలు చేసేటప్పుడు FSSAI లైసెన్స్, తయారీదారు వివరాలు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, సీల్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచిన బాటిళ్లను కొనకపోవడం మంచిది.
మరో ముఖ్యమైన విషయం.. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, నేచురల్ మినరల్ వాటర్ రెండూ ఒకటి కాదు. వాటి మూలాలు, శుద్ధి ప్రక్రియలు, ఖనిజాల పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. నీటిలో ఖనిజాలు ఎక్కువగా ఉండటం కంటే, అది నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటమే ముఖ్యం. బాటిల్‌పై ఉన్న బ్రాండ్ పేరును చూసి కాకుండా, నీటి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ వివాదం మరోసారి గుర్తుచేస్తోంది.