Earth Split: ఈ ఉదయం థాయ్‌లాండ్‌లోని బాంకాక్ నగరంలో చోటు చేసుకున్న ఒక భయంకర ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. నగరంలోని వజిరా హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా ఒక భారీ సింక్‌హోల్ (భూమి కుంగి ఏర్పడిన గుంత) ఏర్పడింది.
సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి ఒక్కసారిగా కుప్పకూలి సుమారు 50 మీటర్ల లోతు.. 30×30 మీటర్ల వెడల్పు గల భయంకరమైన గుంతగా మారింది. ఈ అనూహ్య ఘటనతో చుట్టుపక్కల నివసించే వారు, హాస్పిటల్ సిబ్బంది, రోగులు, ఇతర ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
తక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. వైద్య సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వజిరా హాస్పిటల్, సమీప భవనాలు, పోలీస్ స్టేషన్‌ను వెంటనే ఖాళీ చేయించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలను ఆ ప్రాంతానికి అనుమతించకుండా రోడ్లను మూసివేశారు. అంతేకాక, మిగిలిన భూభాగం యొక్క స్థిరత్వాన్ని పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
సింక్‌హోల్ కారణాలపై దర్యాప్తు
ఇంత భారీ సింక్‌హోల్ ఏర్పడటానికి గల కారణాలను ప్రభుత్వ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బాంకాక్‌లో భూగర్భ జలాలు , పాత మౌలిక సదుపాయాల కారణంగా చిన్నపాటి భూకుప్పకూలికలు సంభవించడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. కానీ ఇంతటి భారీ పరిమాణంలో సింక్‌హోల్ ఏర్పడటం నగర చరిత్రలో అసాధారణమైనది.
ప్రజలకు విజ్ఞప్తి:
అధికారులు ఈ ప్రాంతంలో నివసించే వారు, రోడ్డు ప్రయాణికులు ఎవరూ సింక్‌హోల్ ప్రాంతానికి వెళ్లవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు, అయినప్పటికీ పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటన నగరంలోని భూగర్భ సాంకేతికతలో ఉన్న లోపాలను, పాత భవనాల నిర్వహణ.. తక్షణ స్పందన చర్యల యొక్క అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. ప్రజలు శాంతంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు.
’50 meters deep’: Video shows massive sinkhole in #Bangkok swallowing cars, electrical poles
More details https://t.co/SMygSoT4aS pic.twitter.com/XylHSC0F6e
— The Times Of India (@timesofindia) September 24, 2025