Raul John Aju: ఈ తండ్రి కైనా సరే తన పిల్లలు ఎదిగినప్పుడు.. గొప్ప స్థానంలో ఉన్నప్పుడు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. కానీ ఈ తండ్రికి మాత్రం అంతకు మించిన ఆనందాన్ని అతని కుమారుడు ఇస్తున్నాడు. అంతేకాదు తన తండ్రిని ఏకంగా జాతీయస్థాయిలోనే వార్తల్లో వ్యక్తిగా అయ్యేలాగా నిలబెట్టాడు ఆ కుమారుడు.
కేరళ రాష్ట్రంలో రౌల్ జాన్ అజు అనే 16 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ఇతడు కేరళ రాష్ట్రంలో ఏఐ వండర్ కిడ్ గా దూసుకుపోతున్నాడు. ఇతడు కేవలం 9 సంవత్సరాలకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పట్టు సాధించాడు. ఆ తర్వాత టెక్నాలజీ మీద శిక్షణ ఇచ్చే ఒక అంకుర సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ మొదట్లో ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైంది. ఆ తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఎదిగింది. ప్రస్తుతం ఆ కంపెనీలో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జాన్ అజు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో అతడి తండ్రి కూడా ఉన్నాడు.
16 సంవత్సరాల వయసులో తండ్రి దగ్గర పాకెట్ మనీ తీసుకోవలసిన వేళ.. తన తండ్రికే జాన్ అజు జీతం ఇస్తున్నాడు . అది కూడా సంవత్సరానికి 24 లక్షల ప్యాకేజీ ఇస్తున్నాడు. ఈ ప్రకారం అతడికి రెండు లక్షలు నెలకు వేతనం గా ఇస్తున్నాడు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే తన కుమారుడు ఈ స్థాయికి ఎదగడం పట్ల అజూ జాన్ తండ్రి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు..”నా కుమారుడికి చిన్నప్పటినుంచి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. ఫోన్ అంతగా ఉపయోగించేవాడు కాదు. కాకపోతే టెక్నాలజీ మీద ప్రయోగాలు చేసేవాడు. కొత్త విషయాలను తెలుసుకునేవాడు. యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూసేవాడు. ఆ తర్వాత తను చిన్నపాటి సంస్థను ఏర్పాటు చేశాడు. మొదట్లో మాకు ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే అతడి ఆలోచనను మేము ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు. పైగా అతడిని ప్రోత్సహించాం. అందువల్లే అతడు ఈ స్థాయి దాకా వచ్చాడు. బంధువులు మా కుమారుడు గురించి గొప్పగా చెబుతుంటే గర్వంతో గుండె ఉప్పొంగిపోతోంది. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే కావాల్సిందేముందని”జాన్ అజు తండ్రి చెబుతున్నాడు.
జాన్ అజు ఏర్పాటు చేసిన కంపెనీలో మిగతా ఉద్యోగులకు కూడా మెరుగైన వేతనాలు ఇస్తున్నాడు. ఇప్పటివరకు జాన్ అజు తన సంస్థ ద్వారా లక్షల మంది పిల్లలకు ఏఐ విధానంలో పాఠాలు చెప్పాడు. ఏఐలో మెలకువలు.. టూల్స్.. ఇతర అంశాల గురించి అతడు వివరిస్తుంటాడు. అయితే టెక్నాలజీని ఒక అవకాశం మాదిరిగానే వాడుకోవాలని.. దానిమీద పూర్తిగా డిపెండ్ కాకూడదని జాన్ అజూ చెబుతుంటాడు. టెక్నాలజీ మీద డిపెండ్ అయితే మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని.. సాధ్యమైనంత వరకు కేవలం అవసరాల కోసం మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని జాన్ అజు చెబుతున్నాడు. 16 సంవత్సరాల వయసులో.. తరగతి గదులు.. పుస్తకాలు.. స్నేహితులు వంటి వ్యవహారాలతో గడపాల్సిన బాలుడు.. ఏకంగా 15 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా.. తండ్రికే నెలకు రెండు లక్షల చొప్పున జీతం ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు.