Homeలైఫ్ స్టైల్Online food delivery business growth: కిచెన్ కు బైబై..! ఆన్ లైన్ కు జైజై.....

Online food delivery business growth: కిచెన్ కు బైబై..! ఆన్ లైన్ కు జైజై.. వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ డెలివరీ వ్యాపారం..

Online food delivery business growth: భారతదేశంలో ఆహార సేవల రంగం విప్లవాత్మక మార్పులను చూస్తోంది. ఒకప్పుడు ఇంటి వంటకాలు లేదా హోటళ్లకు వెళ్లి భోజనం చేయడం మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ విస్తరణ, డిజిటల్ చెల్లింపుల పెరుగుదల వల్ల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాలు, గ్రామాల వరకు ఈ సేవలు విస్తరించడం విశేషం. ఇటీవల విడుదలయిన కొన్ని నివేదికల ప్రకారం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారం ప్రతీ ఏటా 19 శాతం వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనిన భట్టి చూస్తే భవిష్యత్ లో కిచెన్ కు బై చెప్పి.. ఆన్ లైన్ కు జై కొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇన్వెస్ట్‌టెక్ ఈక్విటీస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతోంది. 2024 నాటికి సుమారు 9.1 బిలియన్ల డాలర్ల విలువ కలిగిన ఈ రంగం, ఏటా 19శాతం వార్షిక వృద్ధి రేటు తో ముందుకు సాగుతోంది. ఇదే వేగం కొనసాగితే, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ 27 బిలియన్ల డాలర్లకు చేరుకోనుంది. దీనిని భట్టి చూస్తే భారత వినియోగదారుల జీవనశైలి ఎంతగా మారుతుందో తెలుస్తోంది.

ఈ వృద్ధికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా యువతలో పెరిగిన ఆన్‌లైన్ వినియోగం, ఉద్యోగ జీవితపు బిజీ షెడ్యూల్, ఇంట్లో వంటకు సమయం లేకపోవడం వంటి అంశాలు ఉన్నాయి. ఇదే సమయంలో Zomato, Swiggy వంటి ప్రముఖ సంస్థలు అందిస్తున్న వేగవంతమైన డెలివరీతో ఆన్ లైన్ ఆర్డర్లకు డిమాండ్ పెరుగుతోంది. వీటికి తోడు విభిన్న ఆహార ఎంపికలు, ఆకర్షణీయమైన ఆఫర్లు వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి AI, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు.

అలాగే క్లౌడ్ కిచెన్లు (Cloud Kitchens) అనే కొత్త వ్యాపార మోడల్ ఈ రంగాన్ని మరింత విస్తరించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆర్డర్లను నిర్వహించగల ఈ మోడల్ వల్ల చిన్న వ్యాపారులు కూడా మార్కెట్లోకి రావడానికి అవకాశం లభిస్తోంది. దీని వల్ల వినియోగదారులకు విభిన్న రకాల వంటకాలు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఈ రంగం ఎదుగుదలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డెలివరీ పార్ట్‌నర్లకు సరైన వేతనం, రెస్టారెంట్‌లకు కమిషన్ రేట్లు, ఆహార నాణ్యత నియంత్రణ వంటి అంశాలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. అలాగే, అధిక పోటీ కారణంగా కంపెనీలు లాభదాయకతను నిలబెట్టుకోవడం కూడా కష్టతరంగా మారుతోంది. ఏదీ ఏమైనా భారత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తోంది. సాంకేతికత, వినియోగదారుల అభిరుచులు, వ్యాపార మోడళ్లలో వస్తున్న మార్పులు కలిసి ఈ రంగాన్ని మరింత వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఇది భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రంగంగా మారే అవకాశముంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular