Nano Fertilisers : భారతీయులకు నానో అనే పదం సరిపడదనుకుంటా. సరిగ్గా పుష్కరకాలం క్రితం టాటా చైర్మన్ రతన్ టాటా నానో కారును భారతీయులకు పరిచయం చేశారు. లక్ష రూపాయల ఖర్చుతోనే నానో కారు ఇస్తున్నామని ప్రకటించారు. మార్కెట్లోకి అత్యంత అట్టహాసంగా విడుదల చేశారు. రతన్ చెప్పినంత గొప్పగా నానో కారు లేకపోవడం.. భారతీయుల అవసరాలు అంతకుమించి ఉండటంతో నానో కారు ఫెయిల్ అయింది. ఫలితంగా అది గత చరిత్ర అయింది.. ఇక తర్వాత ఏ ఆటోమొబైల్ కంపెనీ కూడా నానో ఇలాంటి వాహనాలను తయారు చేయడం పూర్తిగా తగ్గించాయి. టాటా కంపెనీ అయితే నానో ప్లాంట్ ను పూర్తిగా మార్చేసి.. ఇతర అవసరాల కోసం వినియోగిస్తోంది.
నానో ఎరువులు కూడా..
మనదేశంలో కాంప్లెక్స్ ఎరువుల వినియోగం చాలా ఎక్కువ. హరిత విప్లవం ప్రారంభమైన సంవత్సరంలో కాంప్లెక్స్ ఎరువుల వినియోగం అధికంగా ఉండేది. ఎరువులు ఎన్ని వేస్తే.. పంటలు ఆ స్థాయిలో పండుతాయనే నమ్మకం రైతుల్లో ఉండడం వల్ల రోజు రోజుకు ఎరువుల వినియోగం తారాస్థాయికి చేరుతోంది. ఎరువుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు మనదేశంలో లభ్యం కావు. అందువల్ల ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకోవాల్సి వస్తోంది. జింక్, భాస్వరం, సూపర్ ఫాస్పేట్, నత్రజని వంటి ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు చైనా ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నది. రోజురోజుకు ఎరువుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం 2018లో నానో యూరియా, 2020లో నానో డీఏపీని ప్రవేశపెట్టింది. అయితే ఇవి ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.. నానో యూరియా, డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ (IFFCO) గట్టి ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 7.5 కోట్ల నానో యూరియా బాటిళ్లు, 45 లక్షల నానో డిఏపి బాటిళ్ళను ఇఫ్కో విక్రయించింది. అయినప్పటికీ సంప్రదాయ 45 కిలోల ఎరువు బస్తాల నుంచి రైతులు నానో యూరియా బాటిళ్ల
కు మారడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
పంజాబ్, హర్యానాలో అంతంత మాత్రమే
మనదేశంలో విప్లవాత్మక వ్యవసాయ పద్ధతులకు చిరునామాగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలను పేర్కొంటారు. ఈ రాష్ట్రాల్లో కూడా నానో యూరియా, డిఏపి విఫలమయ్యాయి. 500 మిల్లీలీటర్ల బాటిల్ 50 కిలోల బ్యాగ్ లాగా ఎలా పనిచేస్తుందని? రైతులు ప్రశ్నిస్తున్నారు.. “రైతులు నానో యూరియా లేదా, డిఏపీని కొనుగోలు చేయరు. ఎందుకంటే వారు సంప్రదాయ బ్యాగులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అవి శక్తివంతంగా పనిచేస్తాయని నమ్ముతారు. మేము వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తే రైతులు ఒప్పుకోవడం లేదు. అందువల్లే బ్యాగులను అమ్ముతున్నామని” హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ లోని పేరు రాసేందుకు ఇష్టపడని ఓ ఇఫ్కో డీలర్ పేర్కొన్నాడు. “రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. 500 మిల్లి లీటర్ల బాటిల్ 50 కిలోల బ్యాగ్ మాదిరిగా ఎలా పనిచేస్తుంది? ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 50 కిలోల బస్తా బరువును 45 కిలోలకు తగ్గించింది. ఇప్పుడు ఎరువుల లభ్యతను మరింత పరిమితం చేయాలని భావిస్తోందని” పంజాబ్ లోని కర్నాల్ ఘరౌండా ప్రాంతానికి చెందిన రైతు సందీప్ త్యాగి పేర్కొన్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సాయిల్స్ HoD డాక్టర్ ధన్విందర్ సింగ్ రెండు సంవత్సరాలపాటు క్షేత్రస్థాయిలో నానో ఎరువుల పనితీరుపై ప్రయోగం నిర్వహించారు. 500 ఎం.ఎల్ నానో యూరియా పంటలకు నత్రజని మూలకాన్ని అందించడంలో ప్రత్యామ్నాయం కాదని నిరూపించారు. గోధుమ, వరి పంటలో సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా స్ప్రే చేయడం వల్ల పంటల వేర్ల బయోమాస్ పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల ఇతర పోషకాలు తగ్గాయి. సాధారణ యూరియాను నానో యూరియా మాదిరిగానే స్ప్రే చేయడం వల్ల సారూప్య ఫలితాలు వచ్చాయి.
మరో వైపు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ వీరేందర్ సింగ్ లాథర్ భారత ప్రభుత్వం పై మండిపడుతున్నారు..” దిగుమతి బిల్లులను తగ్గించేందుకు WTO షరతులను అమలు చేస్తోంది. అందువల్లే నానో ఎరువును విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నానో యూరియా అనేది సూడో సైన్స్ కు అద్భుతమైన ఉదాహరణ. రైతులను దోపిడీ చేసే సాధనమని” ఆయన విమర్శిస్తున్నారు.
ఇవీ ఎరువుల లెక్కలు
ఇక అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు మొదటి 11 నెలల్లో కీలకమైన ఎరువుల అమ్మకాలు మూడు శాతం పెరిగాయి. 57.57 మిలియన్ టన్నులకు ఇవి చేరుకున్నాయి. ప్రధానంగా డిఏపి, కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల యూరియా స్తబ్దుగా ఉందని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కీలక ఎరువుల విక్రయాలు మూడు శాతం పెరిగి, 58 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. యూరియా, డిఏపి, ఎన్పీకేఎస్ లతో సహా నాలుగు ప్రధాన ఎరువుల మొత్తం ఉత్పత్తి 384.33 లక్షల మెట్రిక్ టన్నుల (2020-21) నుంచి 428.84 లక్షల మెట్రి టన్నులకు (2022-23) చేరుకుంది. అయినప్పటికీ డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి కావడం లేదు. ఈ కాలంలో 581. 05 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 628.25 లక్షల మెట్రిక్ టన్నులకు ఎరువుల వినియోగం పెరిగింది. ఫలితంగా మన దేశం ఏటా 190 లక్షల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశం మొత్తం అవసరమైన ఎరువులలో 32 శాతం దిగుమతి చేసుకుంటున్నది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why are the farmers taking a step back even though the center is promoting nano fertilisers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com