China : ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, వ్యవసాయంపై వేడి ప్రభావం మరింత తీవ్రమవుతోంది. ఉష్ణోగ్రత ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే, పంట ఉత్పత్తిలో దాదాపు 6 నుండి 8 శాతం వరకు తగ్గుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు వేడిని తట్టుకునే శక్తి వ్యవసాయం, ఆహార భద్రతకు చాలా ముఖ్యమైనది.
Also Read : చైనాలో ఫ్లయింగ్ టాక్సీలు. ఇక ఎగిరిపోవడమే
తాజాగా చైనాకు చెందిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ (IGDB)కి చెందిన ప్రొఫెసర్ జూ కావో బృందం ఈ దిశగా ఒక పెద్ద విజయాన్ని సాధించింది. వారు టమోటా మొక్కలలో ఒక కొత్త జీవ ప్రక్రియను కనుగొన్నారు. ఇది తీవ్రమైన వేడిలో కూడా వాటి పెరుగుదల, దిగుబడిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంటే ఇది వేడిని తట్టుకుని కూడా పుష్పించగలదు.. ఫలించగలదు. ఈ పరిశోధన ఏప్రిల్ 2న జర్నల్ డెవలప్‌మెంటల్ సెల్‌లో ప్రచురించబడింది.
వేడిలో మొక్కల పెరుగుదల ఎందుకు ఆగిపోతుంది?
పరిశోధన ప్రకారం, టమోటా మొక్కలలో ఉండే ‘షూట్ ఎపికల్ మెరిస్టెమ్’ (SAM) అంటే పైకి ఆకులు, పువ్వులు ఏర్పడే ప్రక్రియను నియంత్రించే స్టెమ్ కణాలు వేడికి ఎక్కువగా ప్రభావితమవుతాయి. అధిక వేడి కారణంగా ఈ స్టెమ్ కణాలలో లోపాలు ఏర్పడవచ్చు. దీనివల్ల మొక్క పెరుగుదల ఆగిపోతుంది లేదా అది చనిపోవచ్చు.
అయితే ప్రొఫెసర్ జూ కావో బృందం వేడి సమయంలో మొక్క లోపల ‘రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ (ROS)’ ఏర్పడతాయని కనుగొన్నారు. ఇది ఒక ప్రత్యేక ప్రోటీన్ TMFని సక్రియం చేస్తుంది. ఈ TMF మొక్కకు పువ్వులు ఏర్పడే ప్రక్రియను కొంతకాలం ఆపమని సంకేతం ఇస్తుంది. దీనివల్ల మొక్క వేడి సమయంలో “నిద్రాణస్థితి”లోకి వెళుతుంది. అంటే అది తనను తాను నిలిపివేసుకుంటుంది. ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రాగానే మళ్లీ పెరగడం, ఫలించడం మొదలు పెడుతుంది.
తీవ్రమైన వేడిలో కూడా పాడవదు
ఈ వ్యూహంతో ముందుగా ఫలించే భాగం దిగుబడిలో 34 నుండి 63 శాతం వరకు తగ్గుదలను నివారించవచ్చు. కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మెరుగైన ఉత్పత్తిని అందించగల పంటలను అభివృద్ధి చేసే దిశగా ఈ ఆవిష్కరణ ఒక పెద్ద ముందడుగు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ‘క్లైమేట్ స్మార్ట్ క్రాప్స్’కు మార్గం సుగమం చేయవచ్చు.
Also Read : సలార్ లో ‘ఖాన్సార్’లాగా.. చైనాలో అతిపెద్ద పరిశ్రమ సిటీ.. వైరల్