Rahul Bansal: సివిల్ సర్వీస్ అంటే.. దేశంలో అత్యంత పవర్‌ఫుల్ పదవి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం వీరి చేతుల్లో ఉంటుంది. ఇక ప్రజలకు వీరు ఎలాంటి సేవ అయిన సొంతంగా చేయవచ్చు. అందుకే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌కు ప్రిపేర్ అవుతారు. కానీ కొందరే సక్సెస్ అవుతారు. సివిల్స్ పరీక్ష, ఇంటర్వ్యూ కూడా కఠినంగా ఉంటాయి. ఏటా వేల మంది పరీక్ష రాస్తారు.. ఎంపికయ్యేది మాత్రం వందల్లోనే ఉంటారు. యూపీఎస్సీ, ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రాహుల్ బన్సల్ పేరు ఒకప్పుడు ప్రేరణ. చాలా మందికి ఆయన రోల్‌మోడల్. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఉద్యోగ ఇంటర్వ్యూలో అవినీతిపై ఆవేశంగా, నిర్భయంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మాటలు చాలా మందికి ఆశాజనకంగా అనిపించాయి. ఇప్పుడు అదే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ ఒక సైబర్ మోసం కేసులో లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు.
నాడు అవినీతి వ్యతిరేక స్వరం..
రాహుల్ బన్సల్ యూపీపీఎస్సీ ఇంటర్వ్యూలో చేసిన ప్రసంగం అప్పట్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. అవినీతిని తీవ్రంగా ఖండించి, నిజాయితీగా పనిచేయాలని చెప్పిన ఆ మాటలు చాలా మంది యువ అభ్యర్థులకు మార్గదర్శకంగా మారాయి. అవినీతిపై మాట్లాడటం సులభం. అభిజిత్ దీప్కే, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు కూడా ఇలాంటి స్వరాలు వినిపిస్తూనే ఉంటారు. కానీ ఆ మాటలను ఆచరణలో పెట్టడం చాలా కష్టం. బన్సల్ అప్పుడు ఆ సాహసానికి ఉదాహరణగా నిలిచాడు.
లంచం తీసుకుని దొరికపోయాడు..
ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న బన్సల్ ఒక సైబర్ మోసం కేసులో రూ.కోటి లంచం కోరాడు. నగదు రూపంలో కాకుండా హవాలా మార్గంలో ఆ డబ్బు ఆయన ఖాతాలో జమైంది. ఈ క్రమంలో అసిస్టెంట్ సబ్–ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రాథోడ్, కానిస్టేబుల్ అన్షుల్ శర్మ కూడా పట్టుబడ్డారు. ఒక అధికారి తాను మాత్రమే కాకుండా తనతో పనిచేసే ఇతరులకు కూడా అవినీతి మరక అంటించాడు. తాను అవినీతిపరుడిగా మారడంతోపాటు తన కిందివారిని కూడా అవినీతివైపు మళ్లించిన బన్సల్ ఇప్పుడు అందరితో ఛీ అనిపించుకుంటున్నాడు.
ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి ఇప్పుడు అదే అవినీతికి ఉదాహరణగా మారాడు. ఇలాంటి సంఘటనలు వ్యవస్థలోని పర్యవేక్షణ లోపాలను, అధికారుల మానసిక మార్పులను ప్రశ్నిస్తాయి. అవినీతిపై మాట్లాడటం సరిపోదు. ఆ మాటలను నిజ జీవితంలో పాటించాలి. లేకపోతే ఒకప్పటి ప్రేరణ ఇప్పుడు నిరాశగా మారుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటన అధికార వ్యవస్థలో నిజాయితీని కాపాడేందుకు మరింత కఠిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని గుర్తు చేస్తోంది.
రాహుల్ బన్సల్ కథ ఒక వ్యక్తి పతనం మాత్రమే కాదు. ఇది మాటలు, చర్యల మధ్య అంతరాన్ని, అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ప్రలోభాలను, వ్యవస్థలోని బలహీనతలను ప్రతిబింబించే ఒక గాధ. అవినీతికి వ్యతిరేకంగా నిజంగా నిలబడాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. నిరంతర జాగ్రత్త, సాహసం అవసరం.