Pahalgam Terror Attack Conspiracy: గతేడాది ఏప్రిల్ 26న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. హిందూ పర్యాటకులనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రవాదులను మట్టుపెట్టింది. పాకిస్తాన్ ప్రతిదాడులు చేయడంతో మన వాయుసేన.. పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలు, నూర్‌ఖాన్ అణుకేంద్రానికి సమీపంలోనూ దాడులు చేసి తుక్కుతుక్కు చేసింది. దీంతో పాకిస్తాన్ శరణుకోరి సీజ్‌ఫైర్ చేసుకుంది. ఇదే సమయంలో పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో భారత్ భద్రత కట్టుదిట్టం చేసింది. పాకిస్తాన్‌లో లింకులు ఉన్నవారిని ఏరివేసింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. విదేశీ యాత్రికుల కోసం ఫామ్–సి నమోదు తప్పనిసరిగా చేశారు. దీంతో ప్రభుత్వం వారి రక్షణకు భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తుంది.
తాజా ఉల్లంఘన..
మార్చి 22న పహల్గాం దేవాటు ప్రాంత హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో 23 మంది విదేశీయులు ఎటువంటి సమాచారం లేకుండా బస చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మరోవైపు హోటల్ నిర్వాహకులు ఫామ్–సి నింపకుండా ప్రభుత్వానికి సమాచారం వసతి కల్పించారు. బస చేసినవారిలో 19 మంది యూకే పౌరులు, మిగిలినవారు ఇతర దేశాలవారు. ఏదైనా దుర్ఘటన జరిగితే భారత్ అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్టకు గురవుతుంది. ఉద్రవాదులు దాడిచేసినా దేశ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయి. ఈ ఘటన తీవ్ర భద్రతాలోపాలను బహిర్గతం చేసింది.
ప్రభుత్వ చర్యలు..
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం, టూరిజం శాఖ హోటల్‌పై కఠిన చర్యలు ప్రకటించాయి. భద్రతా నిబంధనల పాటించకపోవడం వల్ల కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడుల నేపథ్యంలో ఫామ్–సి వంటి విధానాలు కట్టుదిట్టం చేయాల్సిన అవసరం తలెత్తింది. హోటళ్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతాపరమైన లోపాలు పర్యాటకరంగాన్ని దెబ్బ తీస్తాయి.
శాంతి భద్రతలు, ఉగ్రదాడులు జరగకుండా ఉండేందుకు, పర్యాటకుల రక్షణ కోసం కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. అయినా హోటళ్ల నిర్వాహకులు నిర్లక్ష్యం వహించడం ఇబ్బందిగా మారింది. ఇది దేశ రక్షణకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ఇటీవలే అమెరికాకు చెందిన వ్యక్తి, ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు వివిధ విమానాశ్రయాల్లో పట్టుబడ్డారు. వీరు బర్మాలో ఉగ్ర సంస్థలకు శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమాచారం లేకుండా విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.