Homeజాతీయ వార్తలుWest Bengal BJP Government: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వంద రోజుల పాలన.. సవేందు అధికారి...

West Bengal BJP Government: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వంద రోజుల పాలన.. సవేందు అధికారి ఏం సాధించారంటే

West Bengal BJP Government: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి. పదిహేనేళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనను ముగించి, స్వాతంత్య్రం తర్వాత తొలిసారి రాష్ట్రంలో బీజేపీ గెలుపు సాధించడం చారిత్రక ఘటన. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ వంద రోజులను పూర్తి ఫలితాల కొలమానంగా తీసుకోవద్దని ప్రజలను కోరారు. ఈ కాలం రాజకీయ వ్యవస్థను సరిదిద్దే దశ అని వివరించారు. అసలు పరీక్ష ఏడాది తర్వాత వస్తుందని, అప్పుడు పదికి తొమ్మిది […]

West Bengal BJP Government: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి. పదిహేనేళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనను ముగించి, స్వాతంత్య్రం తర్వాత తొలిసారి రాష్ట్రంలో బీజేపీ గెలుపు సాధించడం చారిత్రక ఘటన. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ వంద రోజులను పూర్తి ఫలితాల కొలమానంగా తీసుకోవద్దని ప్రజలను కోరారు. ఈ కాలం రాజకీయ వ్యవస్థను సరిదిద్దే దశ అని వివరించారు. అసలు పరీక్ష ఏడాది తర్వాత వస్తుందని, అప్పుడు పదికి తొమ్మిది మార్కులు రాకపోతే వైఫల్యంగా భావిస్తానని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌ వంద రోజుల విజయాలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, బెంగాల్‌లో 41 పేజీల పుస్తకం ద్వారా పనితీరును ప్రజల ముందుంచారు. రాబోయే తొమ్మిది నెలలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, అభివృద్ధి రంగాల్లో కీలకమని నొక్కి చెప్పారు.

రాజకీయ సంస్కృతిలో మార్పు
గతంలో రాష్ట్రంలో రాజకీయ హింస, అధికార పక్షం వైపు నుంచి ప్రత్యర్థులపై దాడులు సాధారణంగా కొనసాగేవి. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్‌ కాలాల్లోనూ ఇది కనిపించేది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణి తగ్గినట్లు కనిపిస్తోంది. అక్రమ వసూళ్లు, కమీషన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ, స్వపక్ష నేతలు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే పార్టీ నుంచి తొలగించారు. నాలుగు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి వసూళ్లు, దాడులు, అక్రమ మద్యం సరఫరా వంటి ఫిర్యాదులపై చర్యలు చేపడుతున్నారు. మాఫియా నెట్‌వర్కులను అరికట్టడం, అక్రమ నివాసాలను తొలగించడం, విచ్ఛిన్నవాద శక్తులను నియంత్రించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో లక్షల మంది బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరిగి వెళ్లారు.

పరిపాలనా మార్పులు
ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, మదరసాల్లో వందేమాతరం పాడడం ప్రారంభమైంది. వందేమాతరం పుట్టిన భూమిపై ఎనభై ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరుగుతోంది. గతంలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల స్థానంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్‌ డే నిర్వహిస్తున్నారు. కాషాయ రంగు బోర్డులు, జెండాలు కనిపించడం దృశ్య మార్పును సూచిస్తున్నాయి. ఇవి రాజకీయ వ్యవస్థలోని మౌలిక మార్పులకు ఉదాహరణలుగా చూడవచ్చు.

సరిహద్దు భద్రత, పరిశ్రమలపై దృష్టి
దేశ భద్రత విషయంలో బీఎస్‌ఎఫ్‌కు భూమి కేటాయింపు, చికెన్స్‌ నెక్‌ ప్రాంతానికి వంద ఎకరాలు కేటాయించడం, కంచె నిర్మాణానికి సహకారం అందించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. కోల్‌కతా విమానాశ్రయం రన్‌వే సమీపంలోని ఒక మసీదును మూసివేసి ప్రార్థనలు నిలిపివేశారు. ఉపాధి సమస్యపై దృష్టి సారిస్తూ, గత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పురూలియాలో నాలుగు వేల కోట్ల రూపాయల స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఫ్లిప్‌కార్ట్, గోయెంకా గ్రూప్‌ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. పరిశ్రమలకు త్వరిత అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఆగస్టు 24, 28 తేదీల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మరిన్ని కీలక నిర్ణయాలు రావచ్చు.

మొత్తంగా సువేందు అధికారి ప్రభుత్వం మొదటి వంద రోజుల్లో రాజకీయ వాతావరణాన్ని మార్చడంపై ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అభివృద్ధి, ఉపాధి, ఆర్థిక పురోగతిపై దృష్టి పెడతామని సీఎం స్వయంగా ప్రకటించారు. తొమ్మిది నెలల్లో కనిపించే ఫలితాలే అసలు పరీక్షగా నిలుస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper