Netaji Subhash Chandra Bose : దేశ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప గొప్ప నాయకులు వారి వారి విధానాలను అవలంబించారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం విభిన్నమైన విధానంలో వెళ్లారు. ఆంగ్లేయులను ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలంటే.. వారి స్థాయిలోనే సమాధానం చెప్పాలని ఆయన మొదటి నుంచి నమ్మారు. దానిని ఆచరణలో కూడా చూపారు. ఆయనకంటూ ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యానికి
అజాజ్ హిందూ ఫౌజ్ పేరు పెట్టారు. ఆయన చేసిన కృషి వల్ల.. ఆయన పేరు ముందు నేతాజీ అనే గౌరవ వాచకం స్థిరపడిపోయింది.
ఇప్పటికీ ఆయన మరణం ఒక మిస్టరీనే
ఇప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఒక మిస్టరీనే. దానిపై రకరకాల వాదనలు ఉన్నప్పటికీ.. ఆయన చితాభస్మం జపాన్ లో ఉంది. జపాన్లోని టోక్యోలో రెంకోజి ఆలయంలో భద్రపరిచారు. అయితే ఆయన అస్థికలను భారత్ తీసుకురావాలని నేతాజీ కుమార్తె అనితా బోస్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించారు. ఇటీవల నరేంద్ర మోడీ అధికారిక పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. నేతాజీ అస్థికలను భారత్ తీసుకురావాలని గతంలో ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఎదురైన సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. మరోవైపు అస్థికల విషయాన్ని బోస్ పిల్లలు కూడా వారసత్వంగా పొందాలని అనుకోలేదు.. వాస్తవానికి బోస్ 1945లో జరిగిన ప్రమాదంలో మరణించారని ఒక కథను ప్రచారంలో ఉంది. ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం ఆయన అస్థికలను బౌద్ధ ఆలయంలో భద్రపరిచింది. నేతాజీ అస్థికల విషయంలో దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చ జరిగినప్పుడు.. 1970లో భారత ప్రభుత్వం ఖోస్లా కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ అన్ని విధాలుగా పరిశీలించి అస్థికలు నేతాజీ వేనని నిర్ధారించింది.. అయితే పీవీ నరసింహారావు ప్రభుత్వం వాటిని తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ అప్పట్లో ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. అస్థికలు తీసుకువచ్చే ప్రక్రియ ఆగిపోయింది.
అది ఆయన వేనా
నేతాజీ మరణం పై అంతుచిక్కని ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో.. 2005లో ముఖర్జీ కమిషన్ ఇచ్చిన నివేదిక సంచలనం కలిగించింది. ఎందుకంటే అప్పటి ప్రమాదంలో చనిపోయింది నేతాజీ కాదని.. ఆ అస్థికలు ఆయనవి కావని స్పష్టం చేసింది. ఈ నివేదికను అధికారికంగా ప్రభుత్వం గుర్తించకపోయినప్పటికీ.. ఈ వివాదం దేశవ్యాప్తంగా గందరగోళానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే అనితాబోస్ తన తండ్రి అస్థికలకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై బోస్ కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేదు.. మరోవైపు నేతాజీ అస్థికలను భారత్ కు ఇచ్చే విషయంలో జపాన్ స్పష్టమైన వైఖరితో ఉంది. భారత ప్రభుత్వం, బోస్ కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి వస్తే.. అధికారికంగా విన్నవిస్తే వాటిని కచ్చితంగా అప్పగిస్తామని జపాన్ చెబుతోంది.. భారత ప్రధాని ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బోస్ కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిఎన్ఏ పరీక్షకు కూడా వారు ఒప్పుకోవడం లేదు. ఒక జాతి స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా పోరాడిన ఒక వీరుడికి.. మరణం అనంతరం కూడా గొప్ప గౌరవం దక్కకపోవడం అత్యంత విషాదం. నేతాజీ అస్థికలు మన దేశానికి వచ్చినప్పుడే.. ఆయన మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడిపోతుందని జాతీయవాదులు అంటున్నారు.