Chandrababu BJP: అప్పట్లో మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి చక్రాలు తిప్పుతానని చంద్రబాబు మంగమ్మ శపథాలు చేశాడు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి 23 దగ్గర ఆగిపోయాడు. అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అని.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబుకు అసలు తత్వం బోధపడుతోంది. అంతేకాదు నిండు శాసనసభలో ఏడ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఫ్కోర్స్ అప్పట్లో మోదిని ఎన్ని మాటలు అన్ని మాటలు అన్నారు. ఇందులో ఆ బ్లడ్ బ్రీడ్ బాలకృష్ణ అయితే సరే సరి. తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళు కూడా వేయించారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యం పెరిగిపోయిన నేపథ్యంలో మోడీ మాత్రం ఎలా ఊరుకుంటాడు అసలు తో సహా ఇచ్చేసాడు. దెబ్బకు బాబుకు గింగిరాలు తిరిగాయి. దీంతో తన పాత కాపు మోదితో స్నేహం పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇవి ఆశించినతమేర సఫలం కావడం లేదు. ఈమధ్య జీ20 సమావేశానికి భారతదేశానికి అధ్యక్ష హోదా రావడంతో దేశంలోని అన్ని పార్టీలను మోడీ పిలిచాడు. రాష్ట్రపతి భవన్ లో విందు కూడా ఇచ్చాడు. అందరితో పిచ్చాపాటి గా మాట్లాడాడు. ఎందుకంటే ఇది మోడీ అవసరం కనుక.ఈ జాబితాలో బాబు కూడా ఉన్నాడు. కానీ ఇదే సమయంలో చంద్రబాబు తన సొంత మీడియాలో రకరకాలుగా రాయించుకున్నాడు. సరే ఆ పైత్యం ఎలా తెలిసింది కాబట్టి.. నిశ్శబ్దంగా ఉండడమే మంచిది.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో..
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి చేయడంతో తెలంగాణలో మళ్లీ పునరుజ్జీవం పొందాలని బాబు ప్లాన్. రేపు తెలంగాణలో టిడిపి పోటీ చేసినప్పటికీ కెసిఆర్ వారించలేని పరిస్థితి.. అందుకే ఏకంగా నిన్న ఖమ్మంలో భారీ ఎత్తున సభ నిర్వహించాడు.. తెలంగాణకు అధ్యక్షుడైన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ కి కూడా ఒక మంచి ఎక్స్పోజర్ కావాలి కాబట్టి ఈ సభను సవాల్ గా తీసుకొని… భారీ ఎత్తున ఖర్చుపెట్టి విజయవంతం చేశాడు. ఇక బాబు అనుకూల మీడియాలో అయితే ఇవాళ వార్తలు హోరెత్తాయి. లైవ్ కూడా రెండు గంటల పాటు ప్రసారం చేశాయి.

సంకేతాలు పంపిస్తున్నారు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలి అంటే బలమైన కూటమి అవసరం. అయితే ఈ దశలో భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ టిడిపి పోటీ చేస్తే ఓట్లను చీల్చేస్తుంది. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి తీవ్ర నష్టం. ఇది జరగకూడదు అంటే టిడిపి బిజెపికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరగాలి అంటే ఏపీలో టిడిపికి బిజెపి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంకేతాలు పంపేందుకే చంద్రబాబు తెరపైకి తెలంగాణలో పోటీ చేసే అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు. నిన్న ఖమ్మంలో జరిగిన మీటింగ్ లోనూ విమర్శలు చేయలేదు. కేవలం తాను చేసిన పనులను చెప్పుకున్నారు. అఫ్కోర్స్ ఇది పార్టీ మీటింగ్ అనేకంటే ఏదో పాఠం చెప్పినట్టు ఉంది అనడం సబబు. పావలా పని చేస్తే రూపాయి అంత పెద్దగా చేసి చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. చివరిగా బాబుకు ప్రచార యావ. పచ్చ మీడియాకు పైసల యావ.. మరి ఈ రెండు యావలు బిజెపి వైపు పరుస్తాయా తోవ? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.