BRS vs Chandrababu : ‘ఫాఫం చంద్రాలు’ సార్.. తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఒత్తిడితోనో.. ఏపీ సరిహద్దున ఉన్న ఖమ్మంలోని టీడీపీ క్యాడర్ కోరికతోనో మొత్తానికి తెలంగాణలో టీడీపీ దుకాణాన్ని పున: ప్రారంభించారు. ఖమ్మంలో సభ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని మళ్లీ స్ట్రాట్ చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను అభివృద్ధి చేసి తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. టీడీపీ నుంచి వివిధపార్టీలోకి వెళ్లిన వారు.. ప్రస్తుతం యాక్టివ్ గా లేనివారు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. పనిలో పనిగా రెండు విడిపోయిన రాష్ట్రాలను కలపడం దండగ అని.. కొందరు బుద్దిలేని వైసీపీ వాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరూ ఇలా చేయరంటూ విభజన రాజకీయాల్లో వేలు పెట్టకుండా తప్పించుకున్నారు.

చంద్రబాబు ఇలా ఖమ్మంలో ప్రకటించారో లేదో టీడీపీలో జోష్ వచ్చింది. ఇన్నాళ్లు తెలంగాణలో టీడీపీని చంపేశామని.. ఇక ఆ పార్టీ లేదు అనుకున్న తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఉన్న పార్టీలు చాలక మళ్లీ చంద్రబాబు వస్తే చినిగి చాటవుతుందని భావించి వెంటనే రంగంలోకి దిగింది. కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు హరీష్ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి చంద్రబాబును టార్గెట్ చేశారు.
‘తెలంగాణలో టీడీపీ రాజకీయాలు సాగవని కవిత విమర్శించారు. ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే అన్నట్టు తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే అని తన నాన్నను వెనకేసుకొని చంద్రబాబుకు అంత సీన్ లేదని కవర్ చేశారు. టీడీపీని తెలంగాణ ప్రజలు రిజక్ట్ చేశారని.. చంద్రబాబు మళ్లీ వచ్చి పార్టీని రివైవ్ చేయడం దండగ అని మొదట్లోనే దెబ్బకొట్టే పనిచేశారు.
ఇక అల్లుడు హరీష్ రావు ఊరుకుంటాడా? పాత పగలన్నీ పైకి లేపాడు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఏపీలో తెలంగాణ దోపిడీకి గురైందని మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపారు. చంద్రబాబు కపట పన్నాగాలు తెలంగాణ ప్రజలు నమ్మరని..ఆయనకు తెలంగాణలో నూకలు చెల్లినట్టేనన్నారు.
చంద్రబాబు ఏపీకే పరిమితమైపోయాడని ఇన్నాళ్లు ధీమాగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆయన రాకతో కంగారు పడుతోంది. బీఆర్ఎస్ కు బలం లేని ఖమ్మంను చంద్రబాబు టార్గెట్ చేసి అక్కడ టీడీపీని బలోపేతం చేయడాన్ని తట్టుకోలేకపోతోంది. అందుకే కవిత, హరీష్ ఎంట్రీ ఇచ్చి చంద్రబాబు అసలు తెలంగాణలోకే రావద్దని డిమాండ్ మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు పార్టీ విస్తరణ బీజేపీ కోసమేనని.. రేపు సీట్లు తగ్గితే తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశమంతా పాకితే.. చంద్రబాబు పక్కరాష్టంలో పాకడం పెద్ద సమస్యే కాదు.. ఈ సమస్య అంతా బీఆర్ఎస్ కే ఎఫెక్ట్. అందుకే ఆనేతల గగ్గోలు మొదలైంది.