Homeజాతీయ వార్తలుBJP Punjab Strategy 2027 Elections: పంజాబ్‌లో బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. బెంగాల్‌ తరహా వ్యూహం...

BJP Punjab Strategy 2027 Elections: పంజాబ్‌లో బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. బెంగాల్‌ తరహా వ్యూహం అమలు!

BJP Punjab Strategy 2027 Elections: ఉత్తర భారత దేశం, తూర్పు, ఈశాన్య, పశ్చిమ భారత్‌లో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఈ రాష్ట్రాల్లో ఒక్కసారైనా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే పంజాబ్‌ ఎప్పుడూ బీజేపీకి సులభమైన భూమి కాదు. సిక్కు రాజకీయాలు, రైతు ఉద్యమాలు, కాంగ్రెస్‌–అకాలీ దళ్‌ ఆధిపత్యం ఇవన్నీ బీజేపీకి గట్టి అడ్డంకులు. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ అడ్డంకులు క్రమంగా తొలగుతున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు పంజాబ్‌ రాజకీయ దృశ్యం నెమ్మదిగా మారబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026, మే నెలలో జరిగిన 1,977 వార్డుల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 172 సీట్లు గెలిచింది. 2021లో కేవలం 49–59 సీట్లు మాత్రమే సాధించిన పార్టీ ఇప్పుడు దాదాపు మూడింతలు పెంచుకోవడం సాధారణ విజయం కాదు.

ఇది నిశ్శబ్ద విప్లవం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్‌) 958 సీట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ అధికార పార్టీగా ఉన్నప్పటికీ సగం సీట్లు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీకి పెద్ద హెచ్చరిక. ఉద్యోగాలు, అభివృద్ధి, డ్రగ్స్‌ సమస్యలపై ప్రజల అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ 397 సీట్లు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభలో మంచి ఫలితాలు సాధించినా, స్థానిక ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల వలసలు (సిద్ధూ వంటివారు) పార్టీని బలహీనపరిచాయి. అకాలీ దళ్‌ 192 సీట్లతో మూడో స్థానంలో ఉండటం దాని క్షీణతను మరింత బయటపెట్టింది. జాట్‌ సిక్కులకు మాత్రమే పరిమితమై, హిందూ, ఇతర సామాజిక వర్గాలను కోల్పోతోంది. ఇక బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 172 సీట్లు గెలవడం వెనుక ఉన్నది కేవలం సంఖ్యలు కాదు.. వ్యూహాత్మక విస్తరణ. అబోహర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50లో 28 సీట్లు గెలిచి మొదటిసారి మెజారిటీ సాధించింది.
పఠాన్‌కోట్‌లో బలమైన ప్రదర్శన. రైతు ఉద్యమానికి కీలకమైన మన్సాలో ఖాతా తెరిచింది. బటిండా కార్పొరేషన్‌లో చరిత్ర సృష్టించింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా సత్తా చాటడం విశేషం.

అన్ని ప్రాంతాల్లో ప్రభావం..
హిందూ ఓటర్లతోపాటు వివిధ సామాజిక వర్గాల్లోకి బీజేపీ వ్యాప్తి చెందుతోందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ నాయకత్వం పశ్చిమబెంగాల్‌లో అనుసరించిన నెమ్మది, స్థిరమైన వ్యూహాన్ని పంజాబ్‌లో అమలు చేస్తోంది. ఒక్కసారి అధికారం కోసం ఆతృత చూపకుండా, సామాజిక బలం, స్థానిక సమస్యలు, డ్రగ్స్, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఆప్‌ కూడా ఇదే తరహాలో నెమ్మదిగా బలపడి 2022లో అధికారం చేపట్టింది. అదే మోడల్‌ బీజేపీకి కూడా పని చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 2027లో బీజేపీ సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే కావచ్చు. కానీ 2032 నాటికి పంజాబ్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ ఫలితాలు బలమైన పునాది వేస్తున్నాయి.

ప్రజలకు ఏం సంకేతం?
పంజాబ్‌ రాజకీయాలు ఇక రెండు–మూడు పార్టీలకు పరిమితం కావడం లేదు. అధికార ఆప్‌పై అసంతృప్తి, కాంగ్రెస్‌–అకాలీదళ్‌ల బలహీనతలు, బీజేపీ యొక్క వ్యూహాత్మక విస్తరణ ఈ మూడు కలిసి కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. పంజాబ్‌కు అవసరం ఒక బలమైన, స్థిరమైన ప్రత్యామ్నాయం. బీజేపీ ఆ ఖాళీని నింపగలదా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. కానీ ఒక విషయం స్పష్టం.. పంజాబ్‌ రాజకీయాలు ఇక ఏకపక్షం కావడం లేదు.

పంజాబ్‌లో మార్పు గాలులు వీస్తున్నాయి. ఈ మార్పు పంజాబ్‌ను మరింత బలోపేతం చేస్తుందా లేదా కొత్త సంక్షోభాలకు దారి తీస్తుందా అనేది 2027 ఎన్నికలు నిర్ణయిస్తాయి. ప్రస్తుతానికి బీజేపీ స్పష్టమైన పురోగతిని సాధించిందనడంలో సందేహం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular