Chandrababu Arrested: విచక్షణారహితంగా జంతువులను చంపి తినే పులి శాంతి వచనాలు వల్లిస్తే ఎలా ఉంటుంది.. నూరు గొడ్లను తిన్న రాబందు అహింస గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. ఇవి ప్రకృతి విరుద్ధమైనవి కాబట్టి.. వీటిని ఎవరూ నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు స్కిల్ కేసులోనూ సాక్షి ప్రసారం చేస్తున్న వార్తలు అలానే ఉన్నాయి. మొన్నటి నుంచి మొదలుపెడితే ఇవాల్టి వరకు..ప్రతీ బులిటెన్ లోనూ చంద్రబాబు గురించే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించే.. నాలుగేళ్ల పాటు ప్రతి విషయాన్ని గెలుకుతున్న జగన్.. చంద్రబాబును తాను అనుకున్నట్టుగానే అరెస్టు చేయించాడు
వాస్తవానికి జగన్ చంద్రబాబు నాయుడిని ఈ కేసులో అరెస్టు చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని కి సంబంధించి భూముల సేకరించిన విషయంలో.. భారీగా తెరవెనుక కుంభకోణం జరిగిందని మొదటి నుంచి జగన్ ఆరోపిస్తున్నాడు. అతడి కాంపౌండ్ నుంచి పబ్లిష్ అయ్యే సాక్షి కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అయితే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుని అమరావతి రాజధాని భూ కేటాయింపులకు సంబంధించే అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ స్కిల్ స్కీంకు సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించాడు. ఏసీబీ కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు పంపించాడు.
అయితే జగన్ చేసే ప్రతి చర్యను సాక్షి సమర్థిస్తుంది కాబట్టి.. చంద్రబాబు అరెస్టు విషయంలోనూ అదే పల్లవి ఎత్తుకుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ స్కీములో ఎలా అవకతవకలు జరిగాయి, ఇందులోకి షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు ఎలా వచ్చాయి? అనే విషయాల మీద సాక్షి పెద్దపెద్ద గ్రాఫిక్స్ వేసి ప్రేక్షకులకు చూపించింది. కానీ ఇక్కడ తెలుగు పాఠకులకు షెల్ కంపెనీలు అంటే ఏమిటో పరిచయమయ్యిందే జగన్ మోహన్ రెడ్డి వల్ల.. ఆ కంపెనీల్లో ఇతర దేశాల నుంచి తప్పుడు మార్గాల ద్వారా పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలిసిందే జగన్ మోహన్ రెడ్డి వల్ల.. కానీ వీటన్నింటినీ దాచి జగన్ మీడియా షెల్ కంపెనీల గురించి చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ మధ్య అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలో.. ఓ పాత్రధారి చెప్పినట్టు.. సాక్షి మీడియా ఇప్పుడు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్..