Covid Vaccine: చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు.. ఒక మోస్తరు వయసులో అకస్మాత్తుగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం.. అకస్మాత్తుగా జ్వరం రావడం.. శరీరం ఊరికే లావవ్వడం.. వంటి లక్షణాలు ఇటీవల చాలామందిలో కనిపిస్తున్నాయి. కొంతమందయితే తరచూ జ్వరం బారిన పడుతున్నారు. లేదా తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ లక్షణాలన్నింటికీ వైద్యులు కోవిడ్ తర్వాత పరిస్థితులే కారణమని చెబుతున్నారు. వాస్తవానికి ఇలాంటి లక్షణాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గుండెపోట్లు సంభవించడం, అకస్మాత్తుగా మరణాల వంటివి మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే పలువురు వైద్యులు, పలు సంస్థలు అధ్యయనాలు చేస్తున్నాయి.. అయితే అన్ని అధ్యయనాలు వేలెత్తి చూపింది కోవిడ్ వ్యాక్సిన్ల పైనే.
2020, 2021 కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఎంతటి ఉత్పాతాన్ని చూపిందో అందరికీ తెలుసు.. దానివల్ల లక్షల మంది కన్నుమూశారు. అంతకంటే ఎక్కువ స్థాయిలో అనారోగ్యానికి గురయ్యారు. చాలా వరకు కంపెనీలు మూతపడ్డాయి. దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోయాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు కోలుకోలేదు. అప్పట్లో కోవిడ్ తీవ్రంగా ప్రబలినప్పుడు కొన్ని సంస్థలు వ్యాక్సిన్లు తయారు చేశాయి. అందులో ఆస్ట్రాజనేకా అనే సంస్థ తయారుచేసిన కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాక్సిన్ ను ఆ సంస్థ మనదేశంలో కూడా విక్రయించింది. ఈ వ్యాక్సిన్ ను చాలా మంది మొదటి, రెండవ డోస్ లుగా వేసుకున్నారు. వేసుకున్న అనంతరం చాలామందిలో దుష్పరిణామాలు వెలుగు చూడటం మొదలుపెట్టాయి. కొందరు దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురికాగా.. మరికొందరు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అయితే దీనిపై అప్పట్లో ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో అస్ట్రా జనేకా తోసి పుచ్చింది. తమ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నూటికి నూరుపాళ్ళు ఒరిజినల్ అని పేర్కొంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని కుండబద్దలు కొట్టింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ తాము తయారుచేసిన కోవి షీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఒప్పుకుంది.
కోవి షీల్డ్ వ్యాక్సిన్ ను ఆస్ట్రాజనేకా మనదేశంలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా విక్రయించింది. అయితే ఈ సంస్థ తొలిసారిగా తాము తయారుచేసిన వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని అంగీకరించింది. ఇంగ్లాండ్ లో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు పలు దుష్పరిణామాలకు గురి కావడంతో.. అక్కడి కోర్టుకు ఎక్కారు. తాము ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల రక్తం గడ్డకడుతోందని, ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోయిందని కోర్టులో ఫిర్యాదు చేశారు.. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజనేకా ప్రతినిధులు కోర్టు ఎదుట హాజరయ్యారు. ” అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చని” వారు పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లపాటు ఆస్ట్రా జనేకా చెప్పింది మొత్తం అబద్ధమని తేలిపోయింది. అంతేకాదు, ఆ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ వల్ల చాలామంది వివిధ రుగ్మతలకు గురైన విషయం నిజమని స్పష్టమైంది. అప్పట్లో ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచంలో చాలా దేశాలు దిగుమతి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అవి ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.