Anil Ravipudi : జీ తెలుగు లో ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం కి జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 8 సీజన్స్ ని పూర్తి చేసుకున్న కామెడీ షో అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది. చిన్న పిల్లలు వేసే స్కిట్స్ , వాళ్ళు చేసే కామెడీ ని చూస్తే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చిన్న పిల్లలు చేసే కామెడీ ఒక ఎత్తు అయితే , ఈ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి , సుడిగాలి సుధీర్ చేసే కామెడీ మరో ఎత్తు. వీళ్లిద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ ఈ షో కి పెద్ద హైలైట్ అనే చెప్పాలి. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్స్ లో వీళ్లిద్దరు క్యారెక్టర్స్ మార్చుకున్నారు.
కాసేపు సుడిగాలి సుధీర్ లాగా అనిల్ రావిపూడి నటిస్తే, అనిల్ రావిపూడి లాగా సుధీర్ నటించారు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న స్కిట్ నడిచింది. సుధీర్ క్యారెక్టర్ లో ఉన్న అనిల్ రావిపూడి ‘నాకు మీ సినిమాలో ఒక్క అవకాశం ఇప్పించండి సార్’ అంటాడు. అప్పుడు అనిల్ రావిపూడి క్యారెక్టర్ లో ఉన్న సుధీర్ ‘కుదరదు అవతలకి పో’ అంటాడు. అప్పుడు అనిల్ రావిపూడి ‘కనీసం ఫ్రెండ్ పక్కన ఉండే క్యారెక్టర్ అయినా ఇవ్వండి’ అని అడుగుతాడు. అందుకు సుధీర్ అనిల్ రావిపూడి చొక్కా పట్టుకొని ‘ఇన్ని రోజులు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తూ హీరో రేంజ్ కి వచ్చావ్, ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ రేంజ్ కి పడిపోతావా’ అని కోపం తో అంటాడు. అలా వీళ్లిద్దరు క్యారెక్టర్లు మార్చుకొని వేసిన స్కిట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా అనిల్ రావిపూడి ని నెటిజెన్స్ బాగా మెచ్చుకుంటున్నారు. అంత పెద్ద డైరెక్టర్ ఎలాంటి ఈగో లేకుండా , సుధీర్ తో తోటి స్నేహితుడు లాగా కలిసిపోయి కామెడీ చేయడమంటే చిన్న విషయం కాదు, అందరూ డైరెక్టర్స్ ఇలా స్నేహంగా ఉండలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండు హిట్స్ రాగానే మాకు మేమె తోపులం అని అనుకునే ఈ రోజుల్లో అనిల్ రావిపూడి లాంటి వరుస సూపర్ హిట్స్ డైరెక్టర్ ఇలా అందరితో కలిసిపోయి మాట్లాడుతుండడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.