Kids mobile phone usage: నేటి కాలంలో ప్రతిదీ స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరుగుతోంది. పెద్దలే కాదు చిన్నారులు కూడా స్మార్ట్ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల ప్రయోజనాలు ఏ స్థాయిలో అయితే ఉన్నాయో.. దుష్పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందువల్ల చిన్నారులకు స్మార్ట్ఫోన్లు ఇచ్చేటప్పుడు పెద్దలు ముందూ వెనుకా ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించిన నేపథ్యంలో.. పిల్లలకు ఫోన్లు కొనివ్వాల్సి వచ్చింది. దీంతో చాలా మంది పిల్లలు తమకు ఏమీ తెలియని వయసులోనే ఫోన్ వాడటం మొదలైంది.
ఇందులో కొంతమంది పిల్లలు రకరకాల యాప్స్ అందులో డౌన్లోడ్ చేసి నిత్యం ఫోన్లోనే మునిగి తేలేవారు. కొన్ని సందర్భాల్లో పెద్దలు మందలించినప్పటికీ.. చాలామంది ఫోన్లోనే తలమునకలయ్యేవారు. దీనివల్ల ఫోన్ అనేది పిల్లలకు ఒక వ్యసనం లాగా మారిపోయింది. దీంతో వారు పెద్దల మాట కూడా వినే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆఫ్లైన్ క్లాసులు మొదలైనప్పటికీ.. అప్పటికే ఫోన్ అందుబాటులో ఉండడంతో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫోన్లోనే ఉండిపోయేవారు. అదేపనిగా ఫోన్ చూడటం వల్ల చాలామంది పిల్లలలో నేత్ర సంబంధిత వ్యాధులు వచ్చాయి. నిండా 15 సంవత్సరాలు రాకముందే కళ్లద్దాలు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఏమైనా అంటే అత్యంత తీవ్రంగా స్పందించేవారు. పిల్లలు ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడతారనే భయంతో చూసీచూడనట్టు వదిలేసేవారు.
ఫోన్లను పిల్లలు విపరీతంగా వాడితే ఆ ప్రభావం వారి మీద అత్యధిక తీవ్రంగా ఉంటుంది. అందువల్ల పిల్లలకు సాధ్యమైనంతవరకు ఫోన్లను దూరం చేయాలంటే.. వారిని ఎండాకాలం సెలవుల్లో ఆడుకోనివ్వాలి. అలాగని ఎండలో కాదు.. ఉదయం పూట, సాయంత్రం పూట వారికి శారీరక, మానసిక ఉత్సాహం కలిగేలా చేయాలి. స్విమ్మింగ్ తీసుకెళ్లడం, క్రికెట్ నేర్పించడం, నీడ పట్టున ఉండి ఆడుకునేలా చేయాలి. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్, ఇతర గ్యాడ్జెట్ లకు దూరంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఆడుకోవడం వల్ల వారిలో శారీరక శ్రమ ఏర్పడుతుంది. దీనివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధ్యమైనంత వరకు పిల్లలతో తల్లిదండ్రులు అత్యంత ప్రేమగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. నిదానంగా వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలి. అప్పుడే వారు స్మార్ట్ పరికరాలకు దూరంగా ఉంటారు.
అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల తగ్గిపోతుంది. నేతల సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. పైగా స్మార్ట్ ఫోన్లో పిల్లలు ఏవైనా చెడు కార్యకలాపాల వైపు ఆకర్షితులైతే ఆ ప్రభావం కుటుంబం మీద మొత్తం పడుతుంది. పైగా పిల్లలు దారి తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి.. సాధ్యమైనంతవరకు వారిని అదుపులో పెట్టే ప్రయత్నం చేయాలి.. ఒకేసారి వారిని స్మార్ట్ ప్రపంచానికి దూరం చేయకుండా.. నెమ్మది నెమ్మదిగా వారికంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి.. అందులోనే తల మునకలయ్యేలా చూడాలి. అప్పుడే వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు.