Healthcare Costs India: హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు పెడితే పాతబస్తీ వరకు లెక్కకు మిక్కిలి కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో రోగులు నిత్యం కిటకిటలాడుతూనే ఉంటారు. ఆ మధ్య ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 1000 కోట్ల వ్యయంతో ఓ సంస్థ అతిపెద్ద ఆసుపత్రి నిర్మించింది.. అంతకుముందు గచ్చిబౌలి ప్రాంతంలో ఓ సంస్థ ఏకంగా 1500 కోట్లతో అతిపెద్ద విశాలమైన ఆసుపత్రి నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదులో కార్పొరేట్ ఆసుపత్రులకు లెక్కే లేదు.
హైదరాబాద్ మాత్రమే కాదు.. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలలో కూడా ఇదే స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మితమవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో అంతకుమించిన సౌకర్యాలతో కార్పొరేట్ ఆసుపత్రులను నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రుల్లో బైపాస్ సర్జరీ నుంచి మొదలు పెడితే నీ రిప్లేస్మెంట్ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రులలో చికిత్స పొందడానికి విదేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని ప్రభుత్వాలు గొప్పగా మెడికల్ టూరిజం అని చెబుతున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి కూడా ఫారినర్ల కంటే గొప్పగా లేదు.
వాతావరణంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం.. ఇంకా అనేక కారణాలవల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు తరచూ రోగాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. రోగులకు ఆర్థిక భారం తప్పడం లేదు. గత ఏడాది జాతీయస్థాయిలో రోగాలు ఖర్చు ఒక్కో కుటుంబానికి 34 వేల 64 రూపాయలు గా ఉండగా.. తెలంగాణలో ఆ మొత్తం 46వేల 316 రూపాయలుగా నమోదయింది. ఏపీలో 39,170 రూపాయలు, తమిళనాడులో 44,535, కర్ణాటకలో 37, 606, కేరళ రాష్ట్రంలో 35,338 రూపాయలు వెచ్చించారు. దేశవ్యాప్తంగా సుమారు 6.51 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు బయటకు వచ్చాయి.
ప్రభుత్వ ఆసుపత్రులలో చెప్పుకోదగ్గ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడం.. వైద్యులలో జవాబు దారి తనం లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు ఇదే అదునుగా రోగులనుంచి భారీగా దండుకుంటున్నారు.. దీనివల్ల రోగాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వాలు వైద్యం మీద భారీగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదు అందువల్లే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు దర్జాగా వెనకేసుకుంటున్నారు.