Foods That Affect Sleep: రోజంతా పని, ఒత్తిడిని కలిగిన వారు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. దీంతో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు. ఇలా నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం నిద్రపోయే ముందు తీసుకునే ఆహారమే.. ముఖ్యంగా కొన్ని పానీయాలు తాగడం వల్ల నిద్రపట్టే అవకాశం ఉండదు. అందువల్ల పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోకూడదు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకీ అవి ఏంటి?
కాఫీ, టీ..
నిద్రపోయే ముందు కాఫీ, టీ వంటి ఎనర్జీ డ్రింక్స్ అసలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఫలితంగా నిద్ర రావడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. నిద్రపోయిన తర్వాత కూడా తరచూ మెలకువ రావడం, నిద్ర లోతు తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
మసాలా, వేయించిన ఆహారాలు..
రాత్రిపూట ఎక్కువగా మసాలా ఉండే కర్రీలు, బిర్యానీ, ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ నూనెతో తయారైన వంటకాలు తీసుకోవడం వల్ల కొందరిలో గుండెల్లో మంట, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకుంటే కడుపులోని ఆమ్లం పైకి రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో నిద్రకు పదేపదే అంతరాయం కలగొచ్చు.
కేకులు, స్వీట్లు కూడా..
పడుకునే ముందు కేకులు, స్వీట్లు, చాక్లెట్లు వంటి ఇతర అధిక చక్కెర ఉన్న పదార్థాలను తీసుకోవడం కూడా సరైన అలవాటు కాదు. వీటివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగవచ్చు. అనంతరం వాటిలో మార్పులు రావడం వల్ల కొందరిలో నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది.
నారింజ, టమాటా వంటి ఆమ్ల పదార్థాలు..
నారింజ, ఇతర సిట్రస్ పండ్లు..
ఈ పండ్లు వల్ల కొందరిలో ఎసిడిటీ లేదా గుండెల్లో మంటను పెంచవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల అసౌకర్యం పెరగవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఇవే సమస్యలు వస్తాయని కాదు. వ్యక్తిగతంగా ఏ ఆహారం ఇబ్బంది కలిగిస్తుందో గమనించడం ముఖ్యం.
బ్రకోలీ, క్యాబేజీతో గ్యాస్ సమస్య..
బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారాలే. కానీ వీటిలో ఉండే కొన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ జీర్ణమయ్యే సమయంలో కొందరిలో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు కారణం కావచ్చు. రాత్రిపూట వీటిని ఎక్కువగా తీసుకుని వెంటనే పడుకుంటే కడుపు ఉబ్బరం వల్ల నిద్రకు ఇబ్బంది కలగొచ్చు.
నిద్రకు ముందు ఏం తీసుకోవాలి?
రాత్రి ఆకలిగా ఉంటే పూర్తిగా ఆహారం మానేయాల్సిన అవసరం లేదు. వ్యక్తికి అనుకూలంగా తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు చిన్న పరిమాణంలో పాలు, పెరుగు లేదా సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. అయితే ఏ ఆహారం తీసుకున్నా పడుకునే సమయానికి, భోజనానికి మధ్య కొంత వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది.