Pithapuram Varma: పిఠాపురం లో నిన్న వర్మ చేసిన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కూటమి పార్టీ కి చెందిన వాళ్ళు ఏ నియోజకవర్గం లో కూడా గొడవలు పడడం లేదు, అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్న విషయం వాస్తవమే కానీ , ఆ సమస్యలను బయటకు రానివ్వకుండా చర్చలతో పరిష్కరించుకుంటున్నారు. ఏ నియోజగవర్గం లో లేని గొడవలు పిఠాపురం లో తరచూ చోటు చేసుకుంటున్నాయి. నిన్న కూడా చిన్న అంశాన్ని పెద్దది చేసి రచ్చ రచ్చ చేసాడు వర్మ మరియు అతని అనుచరులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే , నిన్న జరిగిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమానికి ఇరు పార్టీ నేతలు హాజరయ్యారు. బ్యానర్స్ లో పవన్ కళ్యాణ్ ఫోటో తో పాటు , చంద్రబాబు ఫోటో ని కూడా ఏర్పాటు చేశారు. కేవలం స్వాగతం పలికే ప్రాంతం లో ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఫోటో ని ఉంచారు.
ఈ అంశం పైనే వర్మ అనుచరులు గొడవ చేయడం, జనసేన నాయకులూ కూడా ఎక్కడా తగ్గకుండా తిరగబడడం, జనసేన నేత , మాజీ ఎమ్మెల్యే పెందెం దొరబాబు అయితే నేరుగా వర్మ మీదకు దూసుకొని వెళ్లడం వంటివి జరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వర్మ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగింది ఇక్కడే..వీడి లాగా దత్తతగా రాలేదు ఇక్కడికి’ అంటూ వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది. జరిగిన ఈ సంఘటనలు మొత్తం సీఎం చంద్రబాబు కి తెలిసింది. ఆయన వర్మ తీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కేవలం ప్రోటోకాల్ విషయం లో ఇంత పెద్ద గొడవ పెట్టుకుంటారా ?, వయస్సు లో పెద్ద, రాజకీయ అనుభవం ఉన్న వర్మ ఇలాంటి చిన్న విషయాన్నీ రాద్ధాంతం చేయడం ఏంటి?, ప్రత్యర్థులకు అసలు ఏమి సంకేతం ఇస్తున్నారు అంటూ మండిపడ్డాడట సీఎం.
ఐక్యంగా ముందుకు సాగాల్సిన నేతలు ఇలా ప్రోటోకాల్ పేరుతో వివాదాలకు దిగడం సరికాదని ఆయన ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తోంది. జనసేన నేతలు మా వర్మ గారిపై దాడి చేయడానికి వస్తే, వాళ్ళని తప్పుబట్టాల్సింది పోయి , వర్మ ని తప్పుబట్టడం ఏంటో అర్థం కావడం లేదంటూ వర్మ అనుచరులు సీఎం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై వర్మ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యేట్టు ఉంది. వర్మ తనకు పిఠాపురం లో రాజకీయ భవిష్యత్తు లేదనే భయం తో, రోజుకి ఒక వివాదం సృష్టిస్తూ , చంద్రబాబు ఇలా రియాక్ట్ అయితే పార్టీ నుండి తప్పుకొని , వైసీపీ లోకి చేరే ప్లాన్ లో ఉన్నాడని సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.