Nellore Khiladi Lady: ఆర్థిక లావాదేవీలలో తల దూర్చుతుంది. పెదరాయుడు స్టైల్ లో న్యాయం చెబుతోంది. దానికంటే ముందు సెటిల్మెంట్ చేసుకుంటుంది. న్యాయానికి అన్యాయం చేస్తుంది.. ధర్మానికి అధర్మాన్ని అంటగడుతుంది. మోసపోయిన వారు.. ఇబ్బంది పడినవారు నోరు తెరిస్తే.. నెక్స్ట్ బర్త్డే ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత తన గ్యాంగ్ ను పంపించి చుక్కలు చూపిస్తుంది.
మొదట్లో వైసీపీతో అంట కాగింది. అప్పట్లో వైసిపి తీసుకొచ్చిన దిశ యాప్ ను తనకోసం ప్రమోట్ చేసుకుంది. ఇప్పుడైతే ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే పాగావేసింది.. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు.. రాష్ట్రంలోనే అతిపెద్ద అధికారులతో తనకు పరిచాలు ఉన్నాయని.. ఫోన్లు చేయిస్తానని.. బేరాలు కుదుర్చుకుంటున్నది.. నెల్లూరు జిల్లాలో ఆమె పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, క్రిమినల్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు.
గతంలో ఈమె తప్పుడు పనులు చేసేది. భర్త వద్దన్నాడు. అలాంటి పనులు తప్పన్నాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. కొద్దిరోజులకే అతడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు ఒక దశకు వస్తుందనుకుంటున్న క్రమంలో ఆ అధికారి బదిలీ అయ్యాడు. ఆ అధికారిని బదిలీ చేసిన ఎస్పీతో ఆమె గోవా వెళ్లిపోయింది. ఆ ఫోటోలను ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ కూడా చేసింది.
ముందుగానే చెప్పినట్టు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దిశ యాప్ ను తనకు ప్రమోషన్ గా ఉపయోగించుకుంది. నెల్లూరులో విపరీతంగా ప్రచారం చేయించుకుంది. పోలీసులతో విపరీతమైన పరిచయాలు పెంచుకుంది. కింది నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు ఏం చేయాలో అది చేసింది. ఒకానొక దశలో ఏకంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని భావించింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లికి నిత్యం వెళుతూ ఉండేది. వైసిపి పెద్దలతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసుకుంది. చివరికి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో తిష్ట వేసుకొని కూర్చుని.. “మీకు ఏం కావాలో చెప్పండి.. చేసే స్థాయి నాకుంది. నాకు తగ్గట్టుగా ఇచ్చుకునే రేంజ్ మీకుందా” అంటూ డిఎస్పి, సీఐ, ఎస్సై స్థాయి అధికారులను కమాండ్ చేసే రేంజ్ కు ఆమె ఎదిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పెద్దలతో విపరీతమైన పరిచయాలు పెంచుకొని ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఆమె ఒకసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళింది. దాదాపు 6 నెలల పాటు నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.
Also Read: యూట్యూబ్ వీడియో.. చిన్నారి ప్రాణం కాపాడింది..
ఇక కొద్ది రోజుల నుంచి ఆమె గత ప్రభుత్వంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోంది.. గతంలో దిశ ప్రచారకర్తగా నియమితులైన ఆమె.. పోలీసులతో పరిచయాలు పెంచుకొని.. సీక్రెట్ వీడియోలు రికార్డ్ చేసింది. వాటిని చూపిస్తూ.. పోలీస్ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ తన పనులు చేయించుకుంది. నెల్లూరు నుంచి మొదలు పెడితే తిరుపతి, ప్రకాశం జిల్లా పోలీసులను ఒక ఆట ఆడుకునే స్థాయికి ఎదిగింది. చివరికి ఆమె ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని మాదకద్రవ్యాల వ్యాపారం కూడా చేస్తోందని సమాచారం. ఆమె నివాసం అత్యంత విలాసవంతంగా ఉంటుందని.. అందులోకి వచ్చే వాహనాలకు ఎటువంటి నెంబరు ప్లేట్లు ఉండవని స్థానికులు చెబుతుంటారు. ఆమె చేస్తున్న ఈ గలీజ్ పనులను చూసిన కొంతమంది పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ తనకున్న పలుకుబడితో ఆమె నిలుపుదల చేయించుకుంది.
ఇక ఇటీవల నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఒక యావజ్జీవ ఖైది బయటికి వచ్చాడు. నెల్లూరు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ వద్దని చెప్పినప్పటికీ అతనికి బెయిల్ లభించింది. ఆ బెయిల్ రావడం వెనక ఈమె హస్తము ఉందని తెలుస్తోంది. అయితే ఈమెకు నెల్లూరు జిల్లాలో ఇద్దరు అడ్డుగా ఉన్నారని సమాచారం. వారి అడ్డు తొలగించుకోవడానికి ఆ ఖైదీని బయటికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఆ ఖైదీ బయటకి వస్తే జిల్లాలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని.. ఆ ఇద్దరు వ్యక్తులు హతమవుతారని పోలీసు ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ బెయిల్ లభించింది అంటే.. ఆమెకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం హయాంలో ఆమెను మొగ్గలోనే తుంచేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు.. ఇప్పుడు ఆమె వటవృక్షం అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ప్రేక్షక పాత్రకు పరిమితమైంది.