క్రైస్తవం ప్రస్తుత ఇజ్రాయిల్ దేశం లో పుట్టినా యూరప్ లోకి అడుగుపెట్టిన తర్వాతనే అది విశ్వవ్యాప్తి చెందింది. రాచరికాలు అధికార మతంగా స్వీకరించిన తర్వాత మరింత వేగంగా పుంజుకుంది. యూరప్ లో ఒక్క టర్కీలో తప్పితే అన్ని దేశాల్లో ప్రజలు క్రైస్తవాన్ని స్వీకరించారు. అక్కడనుంచి అమెరికాకి కూడా అంతే వేగంగా విస్తరించింది. ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద మతంగా అవతరించింది. కానీ ప్రస్తుతం అమెరికా లో, యూరప్ లో చర్చీలకు వెళ్ళేవాళ్ళు రోజు రోజుకీ తగ్గిపోతున్నారు. అదేసమయంలో ఆసియా, ఆఫ్రికా లలో ఇస్లాం తోపాటు వేగంగా విస్తరిస్తుంది. అలాగే లాటిన్ అమెరికా లో కూడా . ఈ నేపధ్యంలో మరలా ఒక్కసారి మన దేశంలోకి వద్దాం. ఇంతకుముందు భాగంలో క్రైస్తవం పుట్టు పూర్వోత్తరాలు , విస్తరణ దానికి కారణాలు చర్చించుకున్నాం. ఇక అసలు క్రైస్తవ జనాభా భారత్ లో ఎంత వుండొచ్చు అనే దాని పై మరింతలోతుగా చర్చిద్దాం.
జనాభా లెక్కల్లో నిజానిజాలు
2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో క్రైస్తవులు కేవలం 2.3 శాతం మాత్రమే. అయితే రాష్ట్రాలవారిగా చూస్తే ఈశాన్య భారతం లో అస్సాం, త్రిపుర, సిక్కిం లు మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ తోనో , దాదాపు మెజారిటీ తోనో వున్నాయి. గోవా, కేరళ లో గణనీయంగా వున్నారు. రెండో అతిపెద్ద మతంగా వున్న ఇస్లాంకన్నా క్రైస్తవం ఎక్కువ రాష్ట్రాల్లో మెజారిటీ గా వుండి ఆ మతస్తులే అధికారంలో వున్నారు. ఇది నాణానికి ఒక పార్శ్వమయితే రెండో వైపు కొన్ని రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వుండి కూడా జనాభా లెక్కల్లో వాళ్ళందరూ హిందువులుగా చూపబడుతున్నారనేది నిజం. అందుకు కారణం అందరికీ తెలిసిందే. భారత రాజ్యాంగం ప్రకారం హిందువు లలోని దళితులకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదే దళితులు మతం మారితే ఆ రిజర్వేషన్లు వర్తించవు. ఈ నిబంధన వలన దక్షిణాదిన హిందూ మతం నుంచి క్రైస్తవం లోకి మారిన దళితులు అధికారిక లెక్కల్లో హిందువులుగానే రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవులకు కూడా షెడ్యూల్డ్ కులం గుర్తింపు ఇవ్వాలని అడుగుతున్నారు. అటువంటిదే జరిగితే క్రైస్తవ జనాభా ఒక్కసారిగా కొన్ని రాష్ట్రాల్లో రెండంకెల శాతానికి వెళ్తుంది.
ఉదాహరణకు ఆంధ్ర నే తీసుకుందాం. ఈరోజు దళితులలో దాదాపు అందరూ క్రైస్తవ మతం లోకి మారారు. అలాగే ఇటీవలి కాలం లో ఉత్తరాంధ్ర లోని గిరిజనులందరూ కూడా దాదాపుగా క్రైస్తవం లోకి మారారు. కానీ జనాభా లెక్కల్లో మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర లో క్రైస్తవ జనాభా కేవలం 1.3 శాతమే. విశేషమేమంటే 1971 లో 14.87 లక్షలమందిగా వున్న జనాభా 2011 కి వచ్చేసరికి కేవలం 6.82 లక్షలకు తగ్గింది. అంటే దాదాపు 8 లక్షలు తగ్గింది. అదే తెలంగాణా లో 1971 లో 3.36 లక్షలుంటే 2011 కి 4.47 లక్షలకు పెరిగింది. అంటే ఒక లక్ష పెరిగింది. ఇక జిల్లాల వారిగా చూస్తే 1971 లో కృష్ణా జిల్లాలో 11 శాతం మంది క్రైస్తవులుంటే 2011 లో కేవలం 1.27 శాతం మంది మాత్రమే వున్నారు. అదే గుంటూరు జిల్లాలో 1971 లో 15 శాతం మంది వుంటే 2011 లో కేవలం 3.22 శాతం మంది మాత్రమే వున్నారు. ఇదే లెక్కలు అన్ని జిల్లాల్లో వున్నాయి. ఆంధ్రలో నివసిస్తున్న ప్రతిఒక్కరికీ తెలుసు ఈ లెక్కలు తప్పుల తడక అని. జనాభాలో క్రైస్తవులు దాదాపు 20 శాతం దాకా ఉంటారనేది ఒక అంచనా. ఇదే పరిస్థితి తమిళనాడు లో కూడా. దక్షిణాది రాష్ట్రాలన్నింట వాస్తవ జనాభా కి అధికారిక లెక్కలకి ఎక్కడా పొంతనలేదు. ఈ లెక్కల్ని తీసుకునే సామాజిక వేత్తలు విశ్లేషణలు, వ్యాసాలూ, చర్చలు చేస్తుంటారు. లెక్కలే తప్పయినప్పుడు విశ్లేషణలు అంతకన్నా మెరుగుగా వుండవు. ఉదారవాద మేధావులకు ఈ విషయం తెలిసి కూడా దాటవేస్తూ అధికారక లెక్కలనే వుటంకిస్తూ టీవీ చర్చల్లో గట్టిగా వాదించటం చూస్తున్నాం. వాస్తవానికి దేశవ్యాప్తంగా క్రైస్తవ జనాభా దాదాపు 7 నుంచి 8 శాతం దాకా ఉండొచ్చని, కొంతమంది అంతకంటే ఎక్కువగానే 10 శాతం దాకా ఉండొచ్చని కూడా అంటున్నారు. జనాభా లెక్కల్లో ఇంత అవక తవకలు ఇంకే క్యాటగిరి లోనూ చూడము. దీనికి సమీప భవిష్యత్తులో పరిష్కారం కన్పించటం లేదు. అందరూ సిఎఎ వ్యతిరేక , అనుకూల ఆందోళన లలో మునిగి తేలుతున్నారు తప్పితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించటం లేదు. విశేషమేమంటే అత్యంత నిర్బంధాల మధ్య నడిచే చైనా సమాజం లో కూడా క్రైస్తవ జనాభా చాప కింద నీరులాగా రహస్యంగా విస్తరిస్తుందని చైనా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సమాజ వికాసం లో క్రైస్తవ మత పాత్ర
ఆధునిక భారత సమాజ నిర్మాణం లో క్రైస్తవం ప్రముఖ పాత్ర పోషించింది. పురాతన కాలం లో భారతీయ సమాజం ప్రపంచం లోని అతి కొద్ది నాగరికతల్లో ఒకటిగా వికసించినా తర్వాతికాలంలో పూర్తి వెనకపట్టు పట్టి మూఢ నమ్మకాల్లో, పురుషాధిక్యత తో కునారిల్లింది. ముఖ్యంగా ముస్లిం దండయాత్రల కాలంతో మొదలయ్యి ఇంకా వెనక్కు వెళ్ళిందనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన క్రైస్తవ ప్రవేశం సామాజిక మార్పుకి అవకాశం కలిగించింది. మతాన్ని , సమకాలీన సమాజాన్ని వేరుచేసి చూడలేము. మొదట్లో శాస్త్ర విజ్ఞానానికి అడ్డుపడ్డ క్రైస్తవం తర్వాతి దశలో కలిసి మెలసి ప్రయాణం చేయటానికి అలవాటుపడింది. అందుకే బ్రిటిష్ వారు మన దేశం లోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళతో వచ్చిన క్రైస్తవం సమాజం పై సానుకూల ప్రభావం చూపించింది. రాజా రామ మోహన రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు ప్రాశ్చాత్య ప్రభావం తో సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాల పై పోరాడటం, ఆధునిక విద్య కోసం ఆరాట పడటం , అందరికీ విద్య కావాలని కోరుకోవటం , స్త్రీ సమానత్వం కోసం తర్వాత ఎంతోమంది సంఘ సంస్కర్తలు పాటుబడటం వీటన్నింటిపై క్రైస్తవ మిషనరీల ప్రభావం ఎంతో కొంత వుంది.
ఈశాన్య భారతం లో ఆదివాసీలు ఆధునిక నాగరికతకు అలవాటు పడటం లో క్రైస్తవ మిషనరీల పాత్ర ను ఎవరూ విస్మరించలేరు. నాగాలాండ్ లో వున్న తెగలు ఒకరి తల ఇంకొకరు నరుక్కునే ఆచారం అనాదిగా వుంది. ఎన్ని తలలు అవతలి తెగ వాళ్ళవి సేకరిస్తే అంత ఘనత. ఆ సంస్కృతి ని మార్చి తెగల మధ్య సఖ్యతను తీసుకురావటం లో నాగా చర్చి గణనీయమైన పాత్ర పోషించింది. అలాగే మిజోరాం సమాజ అభివృద్ధి లో కూడా. ఈ రోజు మిజో రాష్ట్రం సాంఘిక ప్రామాణికాల్లో దేశ సగటు కన్నా చాలా ముందుండటానికి చర్చి పాత్ర ఎంతో వుంది. క్రైస్తవ మత వ్యాప్తి లో అక్షరాస్యత భాగంగా వుంది. కేరళ దేశం మొత్తం మీద అక్షరాస్యత లో ముందుంటే కేరళ లో మిగతా మతస్తుల కన్నా క్రైస్తవులు అత్యధిక అక్షరాస్యత కలిగివున్నారు.అలాగే కుటుంబ నియంత్రణ పాటించటం లో క్రైస్తవ సమాజం భారత్ లో ముందుంది. మిగతా మతస్తులతో పోలిస్తే జనాభా వృద్ధి రేటు క్రైస్తవుల్లో తక్కువుంది.
ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ క్రైస్తవ సమాజాల్లో భాగమయ్యింది. యూరప్ పునరుజ్జీవన వుద్యమంతో మొదలై ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం దాదాపు క్రైస్తవ మెజారిటీ దేశాల్లో వేళ్ళూనుకుంది. ఎక్కువ దేశాల్లో మతం రాజ్యాన్నుంచి వేరుచేయబడింది. ఇతరమతస్తులు స్వేచ్చగా తమ మతాచారాల్ని పాటించే హక్కు ఈ దేశాల్లో వుంది. అదే ఇస్లామిక్ దేశాల్లో పరిస్థితులు భిన్నంగా వున్నాయి. మతాన్ని రాజ్యం తో ముడిపెట్టి పరిపాలించటం తో మత సహనం తక్కువగా వుంది. ఇతర మతస్తులు ఇబ్బందులకు గురికాబడుతున్నారు. మనం ఈరోజు నిర్మించుకున్న రాజ్యాంగం ఈ ప్రాశ్చాత్య దేశాలనుంచే స్ఫూర్తి పొందింది. అదే సమయం లో క్రైస్తవ మత వ్యాప్తి భారత్ లో కూడా అనేక ఉద్రిక్తతలకు దారితీసిన, తీస్తున్న సంఘటనలు కూడా వున్నాయి.
మత ఘర్షణలు, కారణాలు
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మత ఘర్షణలు ఎక్కువగా జరిగింది క్రైస్తవం -ఇస్లాం మధ్యనే. వందల సంవత్సరాలు క్రుసేడ్ల పేరుతో నరమేధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రెండింటి మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇస్లాం జిహాదీ శక్తులతో పోరాటం లో రెండు మత దేశాస్తులూ, ప్రభుత్వాలు చేయి చేయి కలిపి పనిచేస్తున్నారు. ఇది శుభ పరిణామం. భారత్ లో మత ఘర్షణల్లో ఇస్లాం -క్రైస్తవం మధ్య ఉద్రిక్తతలు లేవు. అందుకు కారణముంది. రెండు మత ప్రాంతాలు ఒకే చోట లేకపోవటం ప్రధాన కారణం. ప్రాంతాలవారీగా చూస్తే తూర్పున బెంగాల్, బీహార్ ల్లో ముస్లిం లు గణనీయంగా వున్నారు, అక్కడ క్రైస్తవులు పెద్దగా లేరు. ఈశాన్య భారతం లో అస్సాంలోనే ముస్లిం లు గణనీయంగా వున్నారు. అక్కడ క్రైస్తవులు పెద్దగా లేరు. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం మెజారిటీ గా వుంది. అక్కడ ముస్లిం జనాభా లేదు. ఉత్తర భారతం లో ముస్లిం లు గణనీయంగా వున్నారు , అక్కడ క్రైస్తవులు నామ మాత్రమే. పంజాబ్ లో సిక్కులు మెజారిటీ, అక్కడ మిగతా మైనారిటీలు లేరు. పశ్చిమ ప్రాంతం లో మైనారిటీలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు, కొన్ని కేంద్రాల్లో తప్పితే. గోవాలో మాత్రం క్రైస్తవులు గణనీయంగా వున్నారు, అక్కడ ముస్లిం లు పెద్దగా లేరు. ఇక దక్షిణాదిన చూసినట్లయితే ఆంధ్ర, తమిళనాడు లలో క్రైస్తవం గణనీయంగా వుంది. ముస్లిం లు కొన్ని కేంద్రాలకే పరిమితం. కర్ణాటక లోనూ అదే పరిస్థితి. ఎప్పుడో చరిత్రలో టిప్పు సుల్తాన్ మలబార్ తీరం లో, కెనరా జిల్లాలో కొన్ని వేలమంది క్రైస్తవుల్ని ఊచకోత కోసిన ఉదంతం తప్పించి ప్రస్తుతం పెద్దగా ఘర్షణలు లేవు. తెలంగాణా లో ముస్లిం లు గణనీయంగా వున్నారు, క్రైస్తవులు ఆ స్థాయి లో లేరు. ఇక మిగిలింది కేరళ . ఇక్కడ క్రైస్తవులు, ముస్లిం లు ఇద్దరూ గణనీయంగా వున్నారు. అయితే ఇద్దరి ప్రాంతాలు వేరు వేరుగా వున్నాయి. కేరళ ఉత్తర భాగం( మలబార్) లో ముస్లిం లు వుంటే దక్షిణ భాగం ( పూర్వపు ట్రావంకూర్ -కొచ్చిన్ ) లో క్రైస్తవులు వున్నారు. కాబట్టి ఉద్రిక్తతలకు ఆస్కారం లేదు. మొత్తంగా చూస్తే భారత్ లో మైనారిటీ ల్లో ఒకరికొకరికి మత ఘర్షణలకు తావులేదనే చెప్పాలి. ఇది కలిసొచ్చిన అంశం.
హిందూ-క్రైస్తవుల మధ్య ఉద్రిక్తతలు మాత్రం అప్పుడప్పుడూ జరుగుతూనే వున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. స్వాతంత్రానంతరం కూడా మత మార్పిడులు పెద్ద ఎత్తున జరగటం ప్రధాన కారణం. అవి ఎక్కువగా హిందూ మతం నుంచి, ఆదివాసుల నుంచి క్రైస్తవం లోకి జరిగాయి. మత మార్పిడులు వాటంతట అవే జరగవు. మత ప్రచార సంస్థలు ఓ కార్యక్రమంగా చేస్తుంటాయి. మీడియా లో వస్తున్నట్లు క్రైస్తవం నుంచి , ఇస్లాం నుంచి ఘర్ వాపసీ పేరుతో హిందూ మతం లోకి మారేవి చాలా అరుదు. మీడియా ఈ విషయం లో పక్షపాత వైఖరినే అవలంబిస్తుందని చెప్పొచ్చు. చిన్న సంఘటనలను కొండంత చేసి భూతద్దం లో చూపిస్తుందని చెప్పాలి. ఈ 73 సంవత్సరాల్లో ఇతరమతాలనుంచి హిందూ మతం లోకి మారిన వాళ్ళు వందలలోనే, లేకపోతే కొన్ని వేలమంది వుంటారు. కానీ క్రైస్తవం లోకి మారిన వాళ్ళు కోట్లలో వుంటారు. దురదృష్టవశాత్తూ ఇంత పెద్దఎత్తున మతమార్పిడి జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వుండే మీడియా వైఖరి గర్హనీయం. ఒక్క తమిళనాడు , ఆంధ్ర కలిపితేనే కోటి కి పైగా మత మార్పిడులు జరిగాయి. ఈ సమూహ మత మార్పిడులే ఘర్షణలకు కారణం. అదీగాక నిరంతరం హిందూ దేవుళ్ళ గురించి చర్చి లలో జరిగే ప్రచారం కూడా ఉద్రిక్తతలకు దారితీస్తుంది. నేను చిన్నప్పుడు మా వూళ్ళో చర్చి నుంచి రాత్రులు హిందూ దేవుళ్ళు, మతాచారాలపై మైకుల్లో ప్రచారం చేయటం వినే వాణ్ని. వాటిని ప్రభుత్వం నివారించాల్సి వుంటుంది. ఈ సూత్రం వాళ్ళకే కాదు అన్ని మతాలకు వర్తిస్తుంది.
ఇకపోతే ఒరిస్సా లో జరిగిన కొన్ని సంఘటనలు అంతర్జాతీయంగా ప్రచారం లోకి వచ్చాయి. మత మార్పిడులు ప్రధానంగా బాగా వెనకబడిన పశ్చిమ ఒరిస్సాలో జరిగాయి. అక్కడ ఆదివాసులను క్రైస్తవులుగా మార్చటం క్రైస్తవ మిషనరీలు పనిగా పెట్టుకొని కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. దానికి ప్రతిగా హిందూ సంస్థలు కూడా వారిని హిందువులుగా మార్చటం జరుగుతూ వుంది. ఈ ఘర్షణల్లో ఒక క్రైస్తవ మత ప్రచారకుడు చనిపోవటం అంతర్జాతీయంగా సంచలం సృష్టించింది. అది చివరకు రాజకీయంగా బిజెపి – బిజెడి విడిపోవటానికి కూడా దారి తీసింది. అలాగే ఇటీవల తిరుమల దేవస్థానం లో క్రైస్తవ మత ప్రచారం పై పెద్ద ఆందోళన జరిగింది. ఆంధ్రలో ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారాన్ని హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో పనిగట్టుకొని చేస్తుందని హిందువుల్లో ఓ వర్గం బలంగా నమ్ముతుంది. దానికి కారణం స్వతహాగా జగన్, వారి కుటుంబం క్రైస్తవులు కావటమే. ఇందులో నిజమెంతో కాలమే నిర్ణయిస్తుంది. ఇటువంటి సంఘటనలు స్వాతంత్రానంతరం జరుగుతూనే వున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం పై అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు
అంతర్జాతీయ మత స్వేచ్చపై అమెరికా కమిషన్ ( USCIRF) మోడీ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా మత స్వేచ్చలేని పాకిస్తాన్, ఇరాన్, ఉత్తర కొరియా, చైనా ల సరసన చేర్చటం పెద్ద వివాదమయ్యింది. దీనికి వాళ్ళు చెప్పిన కారణం పౌరసత్వ సవరణ చట్టం, డిల్లీ అల్లర్లు. కానీ లోతుగా పరిశీలిస్తే ఇంకా వేరే కారణాలు కూడా వున్నాయని తెలుస్తుంది. మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత కొన్ని వేల ఎన్జిఓ లను నిషేదించటం జరిగింది. దానికి కారణం అవి లెక్కలు చూపించక పోవటం. అందులో చాలా మత ప్రచారం కోసం అమెరికా నుంచి వస్తున్న విదేశీ నిధులని తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వంపై క్రైస్తవ మిషనరీలు కోపంగా వున్నాయి. స్వేచ్చగా మత ప్రచారం చేసుకోవటాన్ని భారత ప్రభుత్వం అడ్డుకుంటుందని అమెరికా కాంగ్రెస్ సభ్యులకు కంప్లయింట్ చేసింది. అమెరికా లోని మత లాబీ చాలా శక్తివంతమైనది. అసలు కోపం అక్కడుందని చెబుతున్నారు. ఏది ఏమైనా భారత దేశంలో మత వుద్రిక్తల్లో హిందూ- క్రైస్తవ అంశం కూడా ముఖ్యమైనదే.
కాబట్టి మనం మత సామరస్య అంశాలు చర్చించేటప్పుడు హిందూ-ముస్లిం ఘర్షణలతో పాటు, హిందూ- క్రైస్తవ ఉద్రిక్తతలు కూడా చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనాల్సి వుంది. ఇప్పటివరకు మనం ప్రధానం గా ఇస్లాం, క్రైస్తవ మతాల గురించి వాటి వ్యవహార శైలి గురించి మాట్లాడుకున్నాం. భారత్ లో మెజారిటీ మతంగా వున్న హిందూ మతం గురించి సందర్భానుసారంగా చర్చించటం తప్పించి విపులంగా చర్చించు కోలేదు. వచ్చే భాగం లో దాని గురించి కూడా విశ్లేషించుకోగలిగితే పరిష్కారమార్గాలు వెదకటం సులభమవుతుంది. అప్పటిదాకా సెలవు.
(సశేషం)
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Communal harmony christians in india part 4
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com