Suzuki Gixxer : భారత మార్కెట్లో తన గిక్సర్ మోటార్‌సైకిల్ సిరీస్‌కు జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. గిక్సర్, గిక్సర్ SF, గిక్సర్ 250, గిక్సర్ SF 250, గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లకు కొత్త పెయింట్ స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ అప్‌డేట్‌లో భాగంగా బైక్‌ల మెకానికల్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఏ మోడల్‌కు ఏ కొత్త కలర్?
సుజుకి గిక్సర్, గిక్సర్ SF మోడళ్లలో మెటాలిక్ ఊర్ట్ గ్రే విత్ పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ డ్యూయల్-టోన్ కలర్‌ను కొత్తగా అందిస్తోంది. ఇక గిక్సర్ 250, గిక్సర్ SF 250 మోడళ్లకు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ విత్ మెటాలిక్ ఊర్ట్ గ్రే కలర్ కాంబినేషన్‌ను తీసుకొచ్చింది.
గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌కు మాత్రం మరిన్ని ఎంపికలు ఉన్నాయి. ఇందులో పై రెండు కలర్ కాంబినేషన్లతో పాటు ప్రత్యేకంగా గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది.
ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు
గిక్సర్, గిక్సర్ SF బైక్‌లు 155cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో కొనసాగుతున్నాయి. ఈ ఇంజిన్ 13.6 bhp పవర్, 13.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోడళ్లలో సుజుకి రైడ్ కనెక్ట్, LED లైటింగ్, డిస్క్ బ్రేకులు, సింగిల్-ఛానల్ ABS వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.
గిక్సర్ 250, గిక్సర్ SF 250 మోడళ్లలో 250cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 26 bhp పవర్, 22.2 Nm టార్క్ అందిస్తూ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
మరోవైపు గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో 85 శాతం వరకు ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని ఉపయోగించగల ఇంజిన్‌ను అందించారు. ఈ వెర్షన్ 27.5 bhp పవర్, 22.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ధరలు ఎంతంటే?
సుజుకి గిక్సర్ ధర రూ.1.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గిక్సర్ SF ప్రారంభ ధర రూ.1.40 లక్షలు. గిక్సర్ 250 ధర రూ.1.84 లక్షల నుంచి, గిక్సర్ SF 250 ధర రూ.1.92 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్-స్పెక్ గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.1.98 లక్షలు. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు.
కొత్త కలర్ ఆప్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. అదనంగా కంపెనీ స్పిన్-ది-వీల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. గిక్సర్, గిక్సర్ SFపై రూ.1,500 వరకు, గిక్సర్ 250, గిక్సర్ SF 250పై రూ.3,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడుతూ.. గిక్సర్ సిరీస్ స్పోర్టీ డిజైన్, ఆకట్టుకునే రైడింగ్ లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. కొత్త కలర్ కాంబినేషన్ల ద్వారా కస్టమర్లకు మరిన్ని ఎంపికలు అందిస్తున్నామని, బైక్‌ల డిజైన్, పనితీరు లక్షణాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.