Raksha Bandhan Business: మన జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక పరమార్ధం. దాని వెనుక చారిత్రాత్మకమైన గాధ ఉంటుంది. పైగా మన పండుగలు సంస్కృతి.. సాంప్రదాయాలతో పెనవేసుకొని ఉంటాయి. అందువల్లే ప్రతి పండుగనూ భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.
మనదేశంలో యావత్ ప్రజలు మొత్తం ఒకేసారి జరుపుకునే పండగలలో రాఖీ ఒకటి. సోదరీ సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారు. రాఖీ పండుగను ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతి అని తేడా లేకుండా ఘనంగా నిర్వహిస్తారు. అందువల్లే రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాపారం భారీగా సాగుతూ ఉంటుంది. గతంతో పోల్చి చూస్తే.. ఇటీవల కాలంలో రాఖీ పండుగ వ్యాపారం విపరీతంగా పెరిగింది.
రాఖీలను వినూత్నంగా రూపొందించడం.. సోదరులకు మిఠాయి లు అందించే విధానంలో భిన్నత్వాన్ని చూపించడంలో సోదరీమణులు పోటీ పడుతుంటారు. తమ స్థాయికి తగ్గట్టుగా వెండి.. బంగారు రాఖీలను తయారు చేస్తూ ఉంటారు. అయితే రాఖీ పండుగ వెనుక వేలకోట్ల వ్యాపారం దాగి ఉంది. అఖిల భారతీయ వర్తకుల సమాఖ్య నివేదిక ప్రకారం మనదేశంలో ఈ ఏడాది రాఖీ పండుగ వ్యాపారం 25వేల నుంచి 30 వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వీట్లు.. ఎండు ఫలాలు.. బహుమతులు.. దుస్తులు.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కానుకలుగా ఇస్తారు. ఫలితంగా రాఖీ వ్యాపారం 30 వేల కోట్ల వరకు దాటిపోతుందని భారత వర్తకుల సమాఖ్య అంచనావేసింది. దేశ రాజధాని ఢిల్లీలోనే దాదాపు 4వేల కోట్ల వరకు రాఖీ వ్యాపారం సాగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు. అయితే గడిచిన మూడు సంవత్సరాలుగా చైనా నుంచి రాఖీలు రావడం పూర్తిగా తగ్గిపోయింది. స్వదేశంలో తయారైన రాఖీలను.. ఇక్కడ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక యువ కొనుగోలుదారులు థీమ్ బేస్డ్ రాఖీలను ఇష్టపడుతున్నారు.. ధర ఎంతైనా పర్వాలేదు అనే స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. యువత తమ సోదరులకు కట్టే రాఖీల విషయంలో కూడా భిన్నత్వాన్ని చూపిస్తున్నారు. అందువల్లే రాఖీ పండుగ వ్యాపారం ఈ స్థాయిలో పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.
మిఠాయిలు.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు.. ఇతర బహుమతుల విషయంలో కూడా ప్రజలు ఏమాత్రం తగ్గడం లేదు. తమ స్థాయిని మించి కొనుగోలు చేస్తున్నారు. సోదరులకు బహుమతులు ఇస్తున్నారు. ఇదే సమయంలో సోదరీమణులకు కూడా అదే స్థాయిలో బహుమతులు ఇవ్వడానికి సోదరులు పోటీ పడుతున్నారు. తద్వారా రాఖీ వ్యాపారం ఈ స్థాయిలో ఉంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రజలు ఉపయోగిస్తున్న నేపథ్యంలో.. స్థానికంగా ఉన్న కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి.