Mahindra October 2026 Sales : దేశీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరో అరుదైన ఘనత సాధించింది. 2026 అక్టోబర్ నెలలో కంపెనీ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. అన్ని విభాగాలను కలిపి మొత్తం 1,31,109 వాహనాలను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఇది 9 శాతం వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీ విక్రయాలు 73,338 యూనిట్లకు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి.
ఎస్‌యూవీలకు భారీ డిమాండ్
2025 అక్టోబర్‌లో మహీంద్రా 71,624 ఎస్‌యూవీలను విక్రయించగా.. ఈ ఏడాది అదే నెలలో 73,338 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఏడాది ప్రాతిపదికన 2.39 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 2026లో నమోదైన 64,092 యూనిట్లతో పోలిస్తే అక్టోబర్‌లో 14.43 శాతం వృద్ధి కనిపించింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 4,31,480 ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం.
పండుగ సీజన్‌లో పెరిగిన కొనుగోళ్లు, కొత్త మోడళ్లకు వచ్చిన ఆదరణ విక్రయాల వృద్ధికి ప్రధాన కారణాలని కంపెనీ వెల్లడించింది. సంస్థ తొలి సీఎన్‌జీ వాహనం XUV 3XO ZNGకు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆటోమోటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేలుసామి తెలిపారు.
త్రిచక్ర వాహనాలు, ఎగుమతుల్లోనూ జోరు
మహీంద్రా త్రిచక్ర వాహనాల విక్రయాలు 38 శాతం పెరిగి 17,632 యూనిట్లకు చేరాయి. ఆటో ఎగుమతులు ఏకంగా 77 శాతం వృద్ధితో 7,102 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రక్కులు, బస్సుల విభాగంలోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు 2 నుంచి 3.5 టన్నుల సామర్థ్యం కలిగిన తేలికపాటి వాణిజ్య వాహనాల విక్రయాలు 5 శాతం పెరిగాయి.
ట్రాక్టర్ల విక్రయాల్లో తగ్గుదల
అన్ని విభాగాల్లోనూ వృద్ధి కనిపించినప్పటికీ ట్రాక్టర్ల దేశీయ అమ్మకాలు మాత్రం 13 శాతం తగ్గి 62,626 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఇవి 72,071 యూనిట్లుగా ఉన్నాయి. దీపావళి పండుగ తేదీల్లో మార్పు కారణంగా ఈ తగ్గుదల నమోదైందని కంపెనీ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా వివరించారు.
ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలు, ఎగుమతుల్లో సాధించిన వృద్ధితో మహీంద్రా అక్టోబర్ నెలను రికార్డు స్థాయిలో ముగించింది.