Homeబిజినెస్Tim Cook Latest Statement: యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు షాక్.. సీఈవో ‘కుక్’ కామెంట్స్ తో...

Tim Cook Latest Statement: యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు షాక్.. సీఈవో ‘కుక్’ కామెంట్స్ తో తీవ్ర చర్చ..

Tim Cook Latest Statement: స్మార్ట్ ఫోన్ రంగంలో రారాజుగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు ఇది షాకింగ్ విషయమే. ఈ ఫోన్ పై ఉన్న అభిమానంతో ఎంత ధర కేటాయించినా కొనేందుకు క్యూ కడుతూ ఉంటారు. అయితే Apple కంపెనీ త్వరలో తన ఐఫోన్‌ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల తయారీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంస్థ సీఈవో Tim Cook తెలిపారు. దీంతో భవిష్యత్తులో విడుదలయ్యే ఐఫోన్ మోడళ్ల ధరలు మరింత పెరగవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా పెరుగుతాయంటే?

స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే NAND ఫ్లాష్ స్టోరేజ్, DRAM మెమరీ చిప్‌లు చాలా కీలకమైనవి. అయితే వీటి ధరలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో చిప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ఈ ప్రభావం నేరుగా స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా అధిక స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ప్రీమియం ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తి వ్యయం మరింత పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ అంశంపై స్పందించిన యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ ‘ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. వినియోగదారులపై భారం తగ్గించే మార్గాలను పరిశీలిస్తున్నాం. అదే సమయంలో కస్టమర్లను రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ప్రస్తుతం పరిస్థితి భరించలేనిదిగా మారుతోంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే ధరలను ఎంత మేర పెంచుతారు? ఏ మోడళ్లపై ప్రభావం ఉంటుందనే విషయాలను ఆయన వెల్లడించలేదు.

సాధారణంగా యాపిల్ కొత్త మోడళ్ల విడుదల సమయంలోనే ధరల సవరణలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐఫోన్ సిరీస్‌లో ధరల పెంపు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా Pro, Pro Max వంటి హైఎండ్ మోడళ్లలో స్టోరేజ్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో వాటి ధరల్లో పెరుగుదల అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

యాపిల్ ధరల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే.. భారతీయ వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే దిగుమతి సుంకాలు, పన్నులు, కరెన్సీ మార్పిడి విలువల కారణంగా భారత్‌లో ఐఫోన్‌లు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ధరలకు విక్రయమవుతున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి వ్యయం కూడా పెరిగితే కొత్త మోడళ్ల ధరలు మరింత భారంగా మారే అవకాశముంది. కొత్త ఐఫోన్ కొనాలని భావిస్తున్నవారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ధరల పెంపు అధికారికంగా ప్రకటించబడితే పాత స్టాక్‌ల ధరలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలు నిర్ణయం తీసుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం అవసరమని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular