YSRCP Diesel Protest Failure: రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరతను సాకుగా చూపిస్తూ పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం అంతే వేగంగా స్పందించింది. డీజిల్ సరఫరా బాగానే జరిగింది. బంకుల్లో నిల్వలు పెరగడంతో సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యింది. దీంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. బంకుల వద్ద వందలాది వాహనాలు బారులు తీరుతున్నట్టు ప్రచారం చేశారు. దీంతో వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాలిపోయింది. అయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న వేళ ఈ సమస్య వెంటనే పరిష్కారం అయింది.
* ఆ చిన్నపాటి వివాదాన్ని..
వాస్తవానికి ఏపీలో డీజిల్ కొరత అనేది లేదు. డీలర్లకు, చమురు కంపెనీలకు మధ్య ఏర్పడిన వివాదం అది. దానిని ఒక ఉద్యమంగా మలుచుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. డీలర్లు అడిగినంతగా అరువు ఇవ్వలేమని చమురు కంపెనీలు చెప్పడమే అసలు సమస్య. దీంతో ఈ వివాదం మరింత పెరిగింది. జఠిలం అయ్యింది. ఈ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియడంతో మరింత దానిని పెంచింది. అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడం ప్రారంభించారు. గత నెలలో తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హడావిడి చేసింది. డీజిల్ కొరతను అధిగమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించడం ప్రారంభించింది.
* ముందుగానే మేల్కొన్న చంద్రబాబు..
అయితే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేశారు సీఎం చంద్రబాబు. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత లేకుండా చూడాలని యంత్రాంగానికి ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో ఎక్కడికక్కడే బంకుల్లో డీజిల్ నిల్వలు పెరిగాయి. అయితే ఈ డీజిల్ కొరతను భారీ ఉద్యమంగా మార్చాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక్కో బంకులో 10 రోజులకు తగ్గట్టు డీజిల్ స్టాక్ రావడంతో ఏం చేయాలో ఆ పార్టీకి పాలు పోలేదు. ఇప్పటికీ అన్ని రకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్న ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లింది కూటమి ప్రభుత్వం. అధినేత జగన్ లేకున్నా డీజిల్ ఉద్యమంతో చెలరేగిపోతామని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది నిరాశగా మిగిలింది.