Visakhapatnam people angry on Jagan: విశాఖ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవతి తల్లి ప్రేమ మాత్రమే ఉందా? ఇప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేవలం విశాఖపై పట్టు సాధించేందుకే పాలనా రాజధానిగా ప్రకటించారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధాని మావిగన్ ప్రతిపాదన విన్నాక.. ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ అందరికంటే ఎక్కువగా విశాఖ ప్రజలు వింతగా చూశారు. అంటే విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి చూపిన ప్రేమ సవతి తల్లి మాదిరిదా అనేది వారిలో ఒక రకమైన ఆవేదన. మచిలీపట్నంలో మా తీసుకోండి.. విజయవాడలో వీ తీసుకోండి.. గుంటూరులో గన్ తీసుకోండి.. మావిగన్ అని పెట్టండి.. అని జగన్మోహన్ రెడ్డి చెప్పేసరికి ఆశ్చర్య పడడం విశాఖ ప్రజల వంతు అయ్యింది. మనసులో ఇంత పెట్టుకొని విశాఖపట్నంపై ఎంత ప్రేమ చూపారు అని ఎక్కువమంది చర్చించుకుంటున్నారు.
రాజధానులతో ఆ ప్రాంతాలకు దూరం..
జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయానికి వచ్చేసరికి చాలా ప్రాంతాలకు దూరం అయ్యారు. అమరావతి రాజధానికి ఒప్పుకున్నారు. తరువాత మూడు రాజధానులు అనేసరికి.. గుంటూరు, కృష్ణ జిల్లాలకు వ్యతిరేకంగా మారిపోయారు. పోనీ మూడు రాజధానులతో విశాఖకు దగ్గరయ్యారు అంటే అది లేదు. విశాఖ తో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు అస్సలు నమ్మలేదు. అటు రాయలసీమ ప్రజలకు సైతం పాలన రాజధానిని మరింత దూరం చేశారని కోపం కలిగింది. కనీసం హైకోర్టు బెంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు రాయలసీమలో. పాలనా రాజధాని ఏర్పాటు చేస్తామన్న ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానించలేదు. రాజధానిని కదిలించడంతో కోస్తాంధ్ర ప్రజలు కలత చెందారు. రాజధానిని దూరం చేయడంతో రాయలసీమ ప్రజలు రగిలిపోయారు. దాని పర్యవసానాలే 2024 ఎన్నికల ఫలితాలు.
Also Read: పవన్ కు తమిళనాడు.. లోకేష్ కు కర్ణాటక.. బిజెపి భారీ వ్యూహం
పాలనా రాజధాని పేరు చెప్పి…
అయితే ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనతో విశాఖ ప్రజలు రగిలిపోతున్నారు. అనవసరంగా విశాఖ పేరును జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. అదేదో అభివృద్ధి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని ఆవేదన చెందుతున్నారు. పాలన రాజధాని అని పేరు చెప్పి విశాఖపై వైసిపి ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కానీ అది అభివృద్ధి పరంగా కాదు. ఐదేళ్లపాటు రాజధాని అని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులపై వైసీపీ పెద్దలు పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనతో విశాఖపై చూపిన ప్రేమ వెనుక ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటి లేదని తేలిపోయింది. జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదనను ఎక్కువగా విశాఖ ప్రజలే తప్పుపడుతున్నారు. మనసులో ఈ అభిప్రాయం పెట్టుకుని విశాఖపై జగన్ చూపిన ప్రేమ వెనుక ఉన్న కథను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే కోస్తాంధ్ర ప్రజలను దూరం చేసుకున్నారు అమరావతిపై వ్యతిరేకతతో.. మూడు రాజధానులు పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల అభిమానాన్ని పొందాలని చూశారు. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర ప్రజలకు సీన్ అర్థమైంది. వైసీపీని ఓడించడానికి కూటమి సిద్ధం కానవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి.
