Telugu Prabha: మన తెలుగు మీడియాలో మేనేజ్మెంట్ రంగులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కొన్ని పత్రికలు న్యూట్రల్ ముసుగు తొడుక్కొని కొన్ని రాజకీయ పార్టీలకు డప్పులు కొడుతుంటాయి. గిట్టని పార్టీల మీద రాళ్లు వేస్తుంటాయి. నచ్చిన వ్యక్తుల పల్లకీలు బ్రహ్మాండంగా మోస్తుంటాయి. ఫలితంగా ప్రకటనలు.. స్థలాలు.. ఇంకా గట్టి నజరానాలు అందుకుంటాయి.
వాస్తవానికి మీడియా ఇలా ఉండకూడదు. భజన చేసే వ్యవస్థ లాగా మారకూడదు. కానీ తెలుగు నాట ఈ పరిస్థితి లేదు. కొన్ని సంవత్సరాలుగా మీడియా రాజకీయ పార్టీల కాళ్ళ కింద చెప్పు లాగా మారిపోయి చాలా రోజులు దాటింది. ఇలాంటి సమయంలో విలువల గురించి మాట్లాడుకోవడం అంటే స్మశానం ముందు ముగ్గు వేసినట్టే ఉంటుంది. సరే మేనేజ్మెంట్లు వాటి ఇష్టం.. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఆయా సంస్థలలో పనిచేసే ఉద్యోగుల విషయంలో మేనేజ్మెంట్లు చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. వాస్తవానికి మీడియాలో గొప్ప జీతాలు ఉండవు. పెద్ద తలకాయలకు మాత్రమే చెప్పుకునే స్థాయిలో జీతాలతో పాటు.. ఓచర్ అమౌంట్లు ఉంటాయి. మిగతా వారి విషయంలో మేనేజ్మెంట్లు అటువంటి కరుణ చూపించవు. వాత్సల్యాన్ని ప్రదర్శించవు.
అప్పట్లో ఓ పత్రికల్లో పని చేసే ఉపసంపాదకుడు రాత్రిపూట విధులు ముగించుకొని వస్తుంటే ఒక వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. కనీసం అతడి గురించి మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఆ పత్రికలో ఉదయం లేస్తే బిజెపి గురించి నెగటివ్ వార్తలు వస్తుంటాయి. కానీ ఆ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం వల్లే ఆ ఉపసంపాదకుడికి 10 లక్షల వరకు వచ్చాయి. కానీ ఆ మేనేజ్మెంట్ ఒక్క రూపాయి కూడా ఆ ఉపసంపాదకుడికి ఇవ్వలేదు. పిఎఫ్ విషయంలో కూడా కంపెనీ రూపాయి కూడా సహాయం చేయలేదు.
ఇక ఇదే పత్రికకు అనుబంధంగా కొనసాగుతున్న ఛానల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి హైదరాబాద్ నగరంలో విధులకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమయంలో అతడిని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అతడికి అప్పటికి పెళ్లి కాలేదు. పెద్దగా చెప్పుకునే జీతం కూడా కాదు. మొదట్లో కొంత మేర వైద్య ఖర్చులను అతని స్నేహితులు భరించారు. ఆ తర్వాత వారు కూడా తమ వల్ల కాదు అని చెప్పడంతో.. ఆ ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగులు తల ఇంతా వేసుకున్నారు. పరిస్థితి విషమించి అతడు చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు డబ్బులు వేసుకొని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో మీడియా సంస్థల మేనేజ్మెంట్ల దారుణాలు.. ఉద్యోగుల పట్ల చూపించే నిర్దయ గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఉదయం లేస్తే నీతులు.. ప్రమాణాలు అని చెప్పుకునే ఈ మీడియా సంస్థల అధినేతలు ఉద్యోగుల విషయంలో హిట్లర్ కంటే దారుణంగా ఉంటారు. మీడియాలో ప్రజల సమస్యల గురించి.. ముఖ్యంగా కార్మికుల సమస్యల గురించి వార్తలు వస్తుంటాయి. అసలు ఆ వార్తలు మీడియాలో పనిచేసే వారి గురించి రాయాలి. బాండెడ్ లేబర్ అంటే తెలుగులో ప్రథమ స్థానంలోనూ ఒక పత్రికలో పనిచేస్తున్న ఉద్యోగులను అడగాలి. గతంలో ఆ పత్రికలో పనిచేసే వారికి లేబర్ చట్టాలకు అనుగుణంగా జీతాలు ఉండేవి. అయితే ఆ స్థాయిలో జీతాలు ఇవ్వలేక ఆ కంపెనీ.. ఏకంగా డిజిటల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. వాస్తవానికి ఆ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థనే అది. కాకపోతే లేబర్ చట్టాలు అక్కడ వర్తించవు. ఇక మరో పత్రికలో అయితే మరింత దారుణం. అందులో సంవత్సరాలకు సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికీ జీవితంలో పెరుగుదల.. జీతంలో ఎదుగుదల తాంబేలుతో పోటీ పడుతూ ఉంటుంది.
ఇంత పాప పంకిలం లాగా మారిపోయిన తెలుగు మీడియా వ్యవస్థలో ఆ మధ్య బిగ్ టీవీ యాజమాన్యం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో పనిచేస్తున్న తమ విలేఖరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే.. ఆ కంపెనీ యాజమాన్యం అప్పటికప్పుడు 15 లక్షలు ఖర్చుపెట్టింది. అతడి సర్జరీకి సహకరించింది. అతడి కుటుంబానికి అండదండగా నిలిచింది. అంతేకాదు అతడు కోలుకున్న తర్వాత సంస్థలో ఉద్యోగం ఉంటుందని మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇక తెలుగు ప్రభ అనే పత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్న కరుణాకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశారు.
కుటుంబానికి పెద్దదిక్కు ఆయన. ఈ విషయం తెలుసుకున్న మేనేజ్మెంట్ వెంటనే మూడు లక్షల రూపాయల చెక్కు అందజేసింది. అదే కాదు అతడి తల్లికి పెన్షన్ అందిస్తామని.. ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అతడి పిల్లలకు ట్యూషన్ ఫీజు కింద ప్రతినెల చెరి 500 చొప్పున వేయి రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. మూడు లక్షలు చిన్న అమౌంట్ కాదు. నెలకు 3000 చిన్న మొత్తం కాదు. పైగా ఆ పత్రిక పేరు పొందిన సంస్థ కాదు. ఆ సంస్థ మేనేజ్మెంట్ కు భారీగా ఆస్తులు లేవు.. ఫిలిం స్టూడియోలు.. పచ్చళ్ళు.. ఇంకా విద్యుత్ తయారీ సంస్థలు.. అమరావతిలో ఫ్లాట్లు.. క్రికెట్ కిట్లు తయారుచేసే ఔట్లెట్లు లేవు.
ఆర్థిక స్థిరత్వం అంత గొప్పగా లేకపోయినప్పటికీ.. అండదండలు అంతగా లేకపోయినప్పటికీ ఆ మేనేజ్మెంట్ ఆ సబ్ ఎడిటర్ మీద అంతస్థాయిలో ప్రేమను చూపించడం.. గొప్ప విషయం. ఈ వార్తను ఆ పత్రిక తాటికాయ పరిమాణం ఉన్న అక్షరాలతో బ్యానర్ వార్తగా వేసుకుంది. తప్పులేదు. అసలు అందులో తప్పే లేదు. కొత్త కార్యాలయం ప్రారంభించినప్పుడు.. మనవరాలు పెళ్లిళ్లు జరిపినప్పుడు పేజీలకు పేజీలు వేసుకునే సో కాల్డ్ మేనేజ్మెంట్ లో ఉన్న తెలుగు మీడియా రంగంలో.. తెలుగు ప్రభ ఒక దీప శిఖ. అన్నిటికంటే ముఖ్యంగా సో కాల్డ్ విలువలను బోధించే సన్నాసి మేనేజ్మెంట్లకు తెలుగు ప్రభ ఒక చెప్పు దెబ్బ.