Journalist Accreditation Card: మొన్ననే కదా మనం చెప్పుకుంది.. ఆ పత్రికలో సర్కులేషన్ వ్యవహారం మొదలైందని.. జిల్లాల వారీగా మీటింగ్లు పెడుతున్నారని.. రిపోర్టర్లకు టార్గెట్లు ఇచ్చారని.. ఇంతటితోనే కథ అయిపోలేదు.
ఆ పత్రిక యజమానానికి కాసుల కక్కుర్తి ఎక్కువ. ఎన్ని డబ్బులు వచ్చినా సరే.. ఏ స్థాయిలో ఇన్కం పెరిగినా సరే ఇంకా కావాలి అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందువల్లే ఆ సంస్థలో పనిచేసే రిపోర్టర్లు ముందుగానే ఫిక్స్ అయితారు. ప్రతి ఏడాది ఆగస్టులోపు సర్కులేషన్ చేయాలి. ఆ తర్వాత సెప్టెంబర్ చివరివారం నుంచి యానివర్సరీ యాడ్స్ మొదలుపెట్టాలి. మేనేజ్మెంట్ లక్ష రూపాయలు టార్గెట్ ఇస్తే 90000 చేయాలి. రెండు లక్షలు ఇస్తే 1,80,000 చేయాలి.. ఐదు లక్షలు ఇస్తే 4.50 లక్షలు చేయాలి. ఇలాగే ఉంటుంది ఆ రిపోర్టర్ల ఆలోచన. ఈస్థాయిలో రిపోర్టర్లు జనాల మీద వసూలు చేయడం ఆ పత్రిక బలంగా ఉన్న జిల్లాలో మాత్రమే ఈ సాధ్యమవుతుంది. మారుమూల జిల్లాలలో ఆ పత్రికకు అంతగా సర్కులేషన్ లేదు. కాకపోతే బ్యూరో చీఫ్ లు.. స్టాపర్లు.. కింది స్థాయి రిపోర్టర్లకు ఎంతో కొంత బలం ఉంటుంది కాబట్టి వారి ద్వారానే యాడ్స్ టార్గెట్ సాధ్యమవుతుంది.
ప్రతి ఏడాది ఇది తప్పనిసరి తద్దినం లాగా ఆ పత్రికలో కొనసాగుతోంది. ఎట్లాగూ కొత్తవాళ్లు రావడం లేదు. ఉన్నవాళ్లు వెళ్లడం లేదు. పైగా సంవత్సరాలకు సంవత్సరాలు జర్నలిజాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగుతున్నారు కాబట్టి.. వాళ్లకు తప్పదు. పైగా ఈసారి యానివర్సరీ యాడ్స్ టార్గెట్ పూర్తి చేయకపోతే మేనేజ్మెంట్ గుర్తింపు కార్డు లాగేసుకుంటుందట. ముందుగానే పెద్ద తలకాయలకు వర్తమానం అందింది. వారంతా కూడా గ్రూపులలో మెసేజులు పెట్టడం మొదలుపెట్టారు. కచ్చితంగా ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలి.. ప్రతి జిల్లాకు ఎంతైతే లక్ష్యంగా విధిస్తారో.. అదంతా ఫినిష్ చేయాలని బ్రాంచ్ మేనేజర్లు సందేశాలు పంపించారు. ఇప్పటికే స్టాపర్లతో.. రిపోర్టర్లతో మీటింగ్ లు పెడుతూనే ఉన్నారు. అసలే ప్రింట్ మీడియాకు రోజులు బాగాలేవు. అసలు మీడియాకే రోజులు బాగాలేవు. ఇలాంటప్పుడు ఎవడు యాడ్స్ ఇస్తాడు.. ఎందుకు ఇస్తాడు.. చివరికి జోల పట్టుకొని.. అడుక్కోవలసిన దుస్థితికి పాత్రికేయులను తీసుకొచ్చారు. ఇటువంటి మీడియా మేనేజ్మెంట్ లు విలువల గురించి చెబుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.
ఎన్నికల సమయంలో ఆ పత్రిక యాజమాన్యం ప్యాకేజీ ఆర్టికల్స్ రాసేది. అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడి దగ్గర 3 నుంచి 5 లక్షల దాకా తీసుకుంది. ఆ తర్వాత ఆ పత్రికలో వార్తలు రాయడం మొదలుపెట్టింది. కాకపోతే ఈ డబ్బు మొత్తం బ్లాక్ మనీ. అంతా క్యాష్ రూపంలోనే వస్తుంది. ఈ డబ్బులు జిల్లాలలో ఉన్న బ్రాంచ్ మేనేజర్లు.. బ్యూరో చీఫ్ లు.. స్టాపర్లు వసూలు చేస్తుంటారు. వాటిని ఎలా పంపించాలో.. బ్రాంచ్ మేనేజర్లకు తెలుసు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా తెలుగు మీడియా రంగంలో ఆ పత్రిక యజమానికి గట్టోడు అనే పేరు ఉంది. అలాంటప్పుడు ఏ ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలవు.. ఏ పోలీసులు మాత్రం అడ్డుకోగలరు. ఆ స్థాయిలో డబ్బు సంపాదించినప్పటికీ.. ప్రకటనల ద్వారా దండిగా వెనకేసుకున్నప్పటికీ ఆ పత్రికా యాజమాన్యానికి ఇంకా డబ్బు ఆశ చావడం లేదు.. అందుకే ఇలా రిపోర్టర్లను పీక్కుని తింటున్నారు.