Dwarampudi Chandrasekhar Reddy: రాజకీయ నాయకులతో దగ్గర సంబంధాలు.. స్థానికంగా ఉన్న రాజకీయాలలో గుర్తింపు.. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం.. ఇలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తి అంతర్జాతీయ స్థాయిలో మత్తు పదార్థాల కేసులో చిక్కుకోవడం ఏపీ రాజకీయాలలో చర్చకు దారి తీస్తోంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తిగా పేరుపొందిన రోకళ్ళ సత్యనారాయణ అలియాస్ సత్యా కొచ్చి విమానాశ్రయంలో మత్తుపదార్ధాలతో పట్టుబడటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
కేరళ రాష్ట్రంలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఏడాది మే 25న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అక్కడి నుంచి వచ్చిన సత్యనారాయణ తో పాటు కాకినాడ చెందిన పందిరి అర్జున్ కుమార్ వద్ద రెండు బ్యాగుల్లో సబ్బు బిల్లల ఆకారంలో దాచిన 20 ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. వాటిలో సుమారు మూడు కిలోలకు పైగా ప్రమాదకరమైన మత్తుపదార్థం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సత్యనారాయణ మీద అధికారులు చర్యలు తీసుకున్నారు. విచారణ సమయంలో అతడు బ్లేడుతో తనను తాను గాయపరచుకోవడానికి ప్రయత్నించినట్టు సమాచారం. అనంతరం అతడిని రిమాండ్ కు తరలించారు.
సత్యనారాయణ గతంలో కాకినాడ నగరంలోని 32వ డివిజన్ కు కార్పొరేటర్ గా పని చేశారు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి దగ్గర వ్యక్తిగా పేరుపొందారు. ఈ నేపథ్యమే ఇప్పుడు ఈ కేసు రాజకీయరంగును తీసుకొచ్చింది. ఒకవైపు మత్తు పదార్థాల కేసు.. మరవైపు రాజకీయంగా కీలకమైన వ్యక్తులతో ఉన్న పరిచయాలు.. ఈ రెండు అంశాలు ఇప్పుడు కాకినాడ రాజకీయాలలో చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం అక్టోబర్ 19న మీడియాలో ప్రముఖంగా రావడంతో వైసిపి కూడా స్పందించింది. సత్యనారాయణ ను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సమాచారం.. ఇప్పటికే రాష్ట్రంలో మత పదార్థాల వినియోగం మీద చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. వైసీపీకి చెందిన ఒక నాయకుడి మీద ఇలాంటి కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తుంది.
ఇక ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఆ మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయి.. వాటిని ఎక్కడికి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు.. వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. అంతర్జాతీయ రవాణాకు సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా.. అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇందులో గనుక ఇతర వ్యక్తులకు ప్రమేయం ఉంటే అప్పుడు ఈ కేసు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది.